Jan 11,2021 19:13

మంచుతెరలు తొలగకముందే శ్రావ్యసంగీతంతో ఊరందరినీ మేలుకొల్పే హరిదాసులు ఒకప్పటి సంక్రాంతి రోజుల్లో పుర వీధుల్లో కనిపించేవారు. సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు.. హరివిల్లులా రంగవల్లులు, విమానాలను తలపించే గాలిపటాలు, బొమ్మల కొలువులు, గంగిరెద్దులు, కొత్తబట్టలు, పిండివంటలు... ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో సందళ్లు... సంక్రాంతి సొంతం. తరాలు మారుతున్నా... ఏళ్లు గడుస్తున్నా... కొన్ని సాంప్రదాయాలు సందర్భానికి వన్నె తెస్తాయి. అలా పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి సంక్రాంతికీ ముంగిళ్లలో సంక్రాంతి శోభను తీసుకువచ్చేది హరిదాసులు..

సంక్రాంతి పండుగ ముఖ్య ఆకర్షణల్లో హరిదాసులది ప్రత్యేకస్థానం. నెత్తిన అక్షయ పాత్ర, ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో సితార, మెళ్లో రంగురంగుల కాగితపు పూల దండలు వారి అలంకరణలు. సాంప్రదాయ వస్త్రధారణతో వినసొంపైన సంకీర్తనలు పాడుకుంటూ ప్రతి లోగిళ్లనూ పలకరిస్తూ సంక్రాంతికే కొత్త అందాన్ని తీసుకువస్తారు. తొలిసంధ్యలో మొదలైన అతని ప్రయాణం ఆ ఊరిలోని ప్రతి ఇంటికీ సుపరిచితమే. అతనికోసం ఎదురుచూసే వారు కూడా ఉంటారు. ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడో...
అంతటి ప్రాచుర్యం సంపాదించుకున్న హరిదాసుల పరిస్థితి రానురాను అలంకారప్రాయంగా మారిపోయింది. పెద్దల తరం పోయి పిల్లల తరం వచ్చింది. అసలు హరిదాసులంటేనే తెలియని పిల్లలున్నారిప్పుడు. అయితే ఎన్ని అడ్డంకులున్నా... పాత తరం సంప్రదాయాలను పక్కన బెట్టడం ఇష్టం లేక ప్రతి ఏడాది తూ.చ తప్పకుండా ఇంటింటికి వచ్చే హరిదాసులు ఇప్పుడు చాలా అరుదుగా కనపడుతున్నారు. అలా విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోట వీధుల్లో శ్రావ్య సంగీతాన్ని వినిపిస్తున్న కొంతమంది హరిదాసుల జీవనవెతలివి...
నరసింహారావుది గుంటూరుజిల్లా బెల్లంకొండ మండలం, ఎమ్మాజిగూడెం. తాతల కాలం నాటి నుంచి వ్యవసాయ కుటుంబమే. ఉన్న కొద్దిపొలం తమ్ముళ్లకు అప్పజెప్పి బతుకుతెరువు కోసం పిడుగురాళ్లకు వలసవెళ్లాడు నరసింహారావు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ ఎప్పుడైనా అవసరమైనప్పుడు పొలం పనులు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూనే కూలిపనులకూ వెళ్లేవాడు. రూ.5 నుంచి పనిచేసిన అనుభవం ఉంది. భార్య, ఇద్దరు పిల్లలు. పనుల్లో ఎంత తీరికలేకుండా ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే చాలు నరసింహారావు హరిదాసుగా మారిపోతాడు. కేవలం అందుకోసమే తన గ్రామం విడిచి కృష్ణలంక చేరుకుంటాడు. అక్కడ ఏదోక ప్రాంతాన్ని ఎంచుకోవడం ఓ నెలరోజులు అద్దె ఇంట్లో దిగడం అతని దినచర్యగా మారిపోయింది. అలా 23 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాడు. కరోనా ప్రభావం ప్రతిఒక్కరి జీవితాలను అతలాకుతలం చేసింది. అయినా సరే ఆర్థికపరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నా ప్రతిఏడాది పలకరించే హరిదాసులు ఈ ఏడాదీ కనపడుతున్నారు. అయితే మునుపెన్నడూ లేనట్లుగా చాలా తక్కువమందే తిరుగుతున్నారు. వాస్తవానికి సంక్రాంతి సందళ్లూ అక్కడక్కడే జరుగుతున్నాయి. మునుపటి సరదాలూ, సంబరాలు ఎక్కువగా కనపడడం లేదు. జనం బయటకు వస్తున్నా భయం పోలేదు. అందుకే ఈ సంక్రాంతికి గతం తాలుకూ పీడకలలను పారదోలుదాం.. కొత్త ఆశలతో ఉత్సాహభరిత సంక్రాంతి సంబరాలు చేసుకుందాం.
 

narasaimharao

                                   ఎంతో గౌరవిస్తారు - నరసింహారావు, గుంటూరు జిల్లా
మా గ్రామం నుంచి డిసెంబరులో నెలగంట పట్టంగానే ఇక్కడకు చేరుకుంటాం. నెలరోజులూ ఇక్కడే ఉండి ప్రతిరోజూ ఉదయం నాలుగంటలకే నిద్రలేచి అలంకారం చేసుకుని సిద్ధంగా ఉంటాం. పక్కనే ఉన్న గుడిలో కొంచెం సేపు ఉండి ఆ తరువాత ఆరు గంటలకు బయలుదేరుతాం. అప్పుడు బయలుదేరినా కొంతమంది నిద్రలేవరు. కీర్తనలు పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతాం. ఎవరినీ భిక్షం అడగం. ఎవరైనా పిలిస్తేనే వెళ్లి, వారు ఇచ్చినదానిని తీసుకుంటాం. మాకు గౌరవం ఇచ్చేవారు ఈ కాలంలో కూడా కనపడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమంది వారి పిల్లలకు మమ్మల్ని పరిచయం చేస్తూ మా గురించి చెబుతుంటే ఎంతో ఉత్సాహం వేస్తుంది.
 

narasayya

                                          ఇదివరకలా లేదు- ఎర్రవెల్లి నర్సాదాస్‌, కృష్ణా జిల్లా
మాది జగ్గయ్య మండలం కృష్ణా జిల్లా. నా పేరు ఎర్రవెల్లి నర్సాదాస్‌. 15 సంవత్సరాల నుంచి కృష్ణలంక రాణిగారి తోటకు వస్తున్నాను. నెలరోజులూ ఇక్కడే మకాం. మా తండ్రి కూడా ప్రతి సంక్రాంతికి ఇదే వృత్తి చేసేవారు. మిగిలిన రోజుల్లో ఊళ్లో పొలం పనులకు వెళ్తాం. గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు హరిదాసులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు తెల్లవారుఝామున నిద్రలేచే కుటుంబాలే చాలా తక్కువగా ఉంటున్నాయి. నలుగురు పిల్లల్లో ముగ్గురికి పెళ్లిళ్లు చేశాను. చదివించే స్థోమత లేక ఎవరినీ పెద్దగా చదివించలేదు. దీంతో వారంతా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. నేను మాత్రం మా నాన్న ఆనవాయితీని కొనసాగిస్తున్నాను. నా పిల్లలు ఈ వృత్తి మీద అంత ఆసక్తి చూపడం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకూ వస్తాను. తరువాత సంగతి ఎలా ఉంటుందో... ఇలా రావడం వల్ల మానసికంగా తృప్తిగా ఉంటుంది. నెలగంట పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటాం. ఇళ్లిళ్లూ తిరుగుతూ మధ్యాహ్నానికి గదికి చేరుకుంటాం. నెలరోజులూ ఇదే మా దినచర్య. కనుమనాడు తిరిగి మా ఊరుకు చేరుకుంటాం.