
హైదరాబాద్ : సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఈ మూవీ విడుదల ఆలస్యమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్లో 'దేవుడే వరాలిస్తాడని నాకు అర్థమైంది.. ఎవరికి పుట్టామో మనకు తెలుస్తుంది. ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది' అని హీరో చెప్పడంతో మొదలవుతుంది. హీరో చిన్నప్పటి నుంచే హీరోయిన్ ఇష్టపడుతున్నారని దీన్నిబట్టే తెలుస్తుంది. మధ్యమధ్యలో గొడవలు.. హీరోహీరోయిన్లు ప్రేమించుకోవడం తెలుస్తోంది. 'లవ్ యూ ఐ' అని రాసిన కృతి.. మన మధ్య లవ్ ఎందుకులే అని పక్కకి జరిపేశాను అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక హీరోయిన్ 'ఈ ఒక్కరాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బ్రతికేద్దాం' అని చెప్పడం..చివర్లో హీరో సముద్రపు ఒడ్డున పడి ఉండటం చూస్తుంటే ఇదొక విషాదాంత ప్రేమ కథ అనే సందేహం కలుగుతోంది. దీనికి దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. వైష్ణవ్ - కతి ఇద్దరూ ఫస్ట్ సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచినట్లు తెలుస్తోంది.