
కలెక్టరేట్:పామాయిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని పామాయిల్ కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ డిమాండ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి గెలలు నరికి, లోడింగ్ అన్ లోడింగ్ చేసే కార్మికులను ప్రభుత్వం గుర్తించలేదన్నారు. కార్మికులు గెలలు నారికేటప్పుడు చెట్లుపై పాములు, తేల్లు, జెర్రెలు కరిచి కొంతమంది చనిపోతున్నారన్నారు. 20నుండి 40అడుగుల ఎత్తులో ఉన్న ఇనుపగెడలతో గెలలు కోసినప్పుడు అవి విద్యుత్ తీగలపై పడి షాక్‌కు గురై కొంత మంది చనిపోతున్నారన్నారు. కొంత మంది వికలాంగులు మారి జీవితంలో ఏ పని చేయలేకపోతున్నారన్నారు. కావున ప్రభుత్వం పామాయిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత భీమా పథకం వర్తింప చేయాల కోరారు. పామాయిల్ కార్మికుల సంఘం జిల్లా కన్వీనర్ మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు నాలుగువేల మంది పామాయిల్ కార్మికులు ఉన్నారని రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలేవీ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. సాలూరు ఇప్పటికే అనేక మంది వికలాంగులయ్యారన్నారు. కార్మికులకు కూడా నష్టపరిహారాలు, సబ్సిడీలు ఇవ్వాలని, రోజు కూలి వెయ్యి రూపాయలు ఇచ్చేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న కాలంలో కార్మికులందర్నీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ఈశ్వరరావు , కొల్లి గంగు నాయుడు పాల్గొన్నారు.