Dec 02,2022 00:16

అనకాపల్లిలో ఆందోళన చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి-అనకాపల్లి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక సర్వకామదాంబ పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు మాట్లాడుతూ 2019 నుంచి ఆగిపోయిన క్లైమ్‌లను పరిష్కరించాలన్నారు. కరోనా రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, ఇప్పుడు సంక్షేమ బోర్డును రద్దు చేయడం ద్వారా కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెయింటర్‌ యూనియన్‌ అధ్యక్షులు వై.సూర్యనారాయణ, కార్యదర్శి పి.పురుషోత్తం, కోశాధికారి ఎ.శ్రీను, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులు రూ.1200 కోట్లు ప్రభుత్వం దారి మళ్లించిందని, తక్షణమే ఆ నిధులను బోర్డుకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము, మండల కార్యదర్శి కె.సోమునాయుడు, నాయకులు అప్పలనాయుడు, రాజు, చిన్న అచ్చంనాయుడు, నాగరాజు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని జె.తుని సచివాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సిమెంటు, స్టీల్‌, రంగులు తదితర ధరలు తగ్గించాలని, ఇసుకను అందుబాటు ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పోలయ్య, మజ్జి శ్రీరాము, మజ్జి రమణ, తిర్రి రమణ, తిర్రి బాబు రావు పాల్గొన్నారు.
సబ్బవరం : భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా కార్యదర్శి గొంతిన అప్పారావు(చంటి) మాట్లాడుతూ జిల్లాలో భవన, ఇతర నిర్మాణ కార్మికులు సుమారు లక్ష మంది ఉన్నారని, వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమో 1214 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోపి సత్యం, ఏలూరి వెంకట రమణ, త్రినాథ్‌, గొంప ముత్యాల నాయుడు పాల్గొన్నారు.