
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ఉత్తరాంధ్ర జెసిఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సుజాత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గృహ సారధులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వ పాలనపట్ల ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయలేక వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో గృహ సారధులు, సచివాలయ కన్వీనర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు చెప్పారు. ప్రతి ఇంటికి గహసారథులు వెళ్లి ప్రభుత్వ పథకాలను, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనా తీరును, ప్రస్తుత ప్రభుత్వ పాలన తీరును వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో గృహ సారధుల మండల కమిటీ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, ఎఎంసిమాజీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి నారాయణ, కెల్ల త్రినాథ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.