Jul 26,2021 06:29

''సమాజం ఉన్నంత కాలం క్రియాశీలంగా ఉండే సామాజిక దృగ్గోచర విషయాల్లో భాష కూడా ఒకటని, సమాజ ఆవిర్భావ అభివృద్ధితో పాటే భాష కూడా ఆవిర్భవించి అభివృద్ధి చెందుతున్నందున సమాజం నశించినప్పుడు మాత్రమే భాష నశిస్తుందని'' స్టాలిన్‌ అన్నాడు. భాషను సృష్టించి సంరక్షించాల్సింది మనమే. కాని ఇప్పుడు మన రాష్ట్ర ఫ్రభుత్వం చేస్తున్నదేమిటి..? సామ్రాజ్యవాద ఉచ్చులో పడకుండా సామాజిక చైతన్యం దిశగా అడుగులు వేస్తు కార్పొరేట్‌ క్యాపిటలిజం అంతరించేలా భాషోద్యమం చేయాల్సిన సందర్భంలో తెలుగు భాషకు ఉరితాడు బిగిస్తోంది. తెలుగు భాష వైభవాలను ప్రపంచానికి తెలియజేసి భాష వికాసమే లక్ష్యంగా 1975 ఏప్రిల్‌ 12 నుంచి 18 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన మొదటి ప్రపంచ మహాసభలు మొదలుకొని 2012 డిసెంబర్‌ 27 నుండి 29 వరకు తిరుపతి వేదికగా జరిగిన నాల్గొవ ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించుకున్నాం. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల్లో తొమ్మిది అంశాల్ని చర్చించి తీర్మానించారు. అందులో ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో, మనదేశంలో, ఇతర రాష్ట్రాలోనూ ఉన్న తెలుగువారితో భావ సమైక్యాన్ని కలిగించాలని, వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి తెలుగు భాషా సంస్క ృతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించి వాటికి పరిష్కారాలు అన్వేషించాలని తీర్మానించారు. అలాగే పాలనా, బోధన ప్రసార మాధ్యమాల భాషగా తెలుగును సమర్థవంతంగా వాడుకలోకి తేవాలని నిర్ణయాలు తీసుకున్నారే గాని అవి ఎంతవరకు ఆచరణలో పెట్టారో సమీక్ష చేసుకోవాలి.
     భాషల్ని, భావాల్ని, ప్రాంతాల్ని, వర్గాల్ని విడగొట్టడమూ ప్రపంచీకరణలో ఒక భాగమే. ఇందువల్ల సామ్రాజ్యవాద విధానాలు ప్రజ వ్యతిరేక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని భారత ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడమే ప్రపంచీకరణ ఏకైక లక్ష్యం. అందుకే భాషాసాహిత్య సంస్కృతుల్ని కాపాడుకోవడం ఎక్కడా ఏ అవసరమూ రాని సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం వెనక తెలుగును నాశనం చేసే కుట్రదాగి ఉందనిపిస్తుంది. అంతరించిపోతున్న భారతీయ భాషల జాబితాలో తెలుగు భాష కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయి యునెస్కో హెచ్చరించినా మన పాలకులకు చెవికెక్కడం లేదు. 1971లో తెలుగు మాట్లాడేవాళ్ళు 8.16 శాతం ఉండగా 2001 తరువాత 7.19 శాతం నమోదయిందని గణాంకాలు చెపుతున్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాషాభివృద్ధికి నడుం బిగించకపోగా పరభాషల పెత్తనానికి తలుపులు తెరుస్తున్నాయి.
 

                                                             భారతీయ భాషా సంస్థాన్‌

    మన దేశ అత్యున్నత చట్ట సభలైన పార్లమెంటు ఉభయసభలు భాషా ప్రాధ్యానతను నొక్కి చెపుతూ 18.01.1968వ తేదిన ఒక తీర్మానం చేశాయి. మనదేశంలో 20 ప్రధాన భాషలు హిందీతో సహ భారతీయ భాషలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని భాషలను అభివృద్ధి చేయాలని, దీని వలనే విద్యా, సాంస్క ృతిక అభివృద్ధి సాధ్యమవుతుందని పార్లమెంటు చెప్పింది. దీనివల్ల విభిన్న భాషలు గల దేశంగా మనదేశానికి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడింది. వివిధ భాషలు మాట్లాడుతున్న ఒకే నేలకు చెందిన వారమై దేశంలో ఉమ్మడి సంస్క ృతి అభివృద్ధి అయ్యేందుకు భాషలు మహత్తరమైన సాధనాలవుతాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 17.07.1969న కర్నాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారతీయ భాషా సంస్థాన్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఏడు కేంద్రాలుగా విస్తరించి భాషా పరిశోధన, విశ్లేషణ, భాషా బోధన, భాషా విజ్ఞానం, భాషా వినియోగం వంటి పంచ సూత్రాలతో ముందుకు వెళుతున్నది.
      1970లో దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రాన్ని మైసూరు నగరంలోనే స్థాపించి ఇందులో కన్నడ, మళయాళం, తమిళం, తెలుగు భాషల అభివృద్ధికై నడుం బిగించింది. ఇదే సంవత్సరంలోనే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో తూర్పు ప్రాంతీయ భాషా కేంద్రం ఏర్పాటు చేసి బెంగాలీ, మైథీలి, ఒరియా, సంతాలీ భాషల అభివృద్ధికి బాటలు వేసింది. ఉత్తర ప్రాంతీయ భాషాకేంద్రం పాటిÄయాలలో స్థాపించి, డోగ్రి, కశ్మీరి, పంజాబీ, ఉర్దూ భాషల అభివృద్ధికి కంకణం కట్టుకున్నది. పశ్చిమ ప్రాంతీయ భాషా కేంద్రం పూణేలో స్థాపించి గుజరాతీ, కొంకిణి, మరాఠి, సింధీ భాషలను అభివృద్ధి దిశగా నడిపించింది. 1989లో ఈశాన్య ప్రాంతీయ భాషా కేంద్రాన్ని గౌహతిలో ఏర్పాటు చేసి అస్సామీ, బోడో, మణిపూరి, నేపాలీ, భాషల అభివృద్ధికి చర్యలు తీసుకున్నది. 1973లో ఉర్దూ భాషాభివృద్ధికై ప్రత్యేకంగా లక్నోలో, 1984 సోలన్‌లో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. సదరు 7 కేంద్రాలలో 550 మంది విద్యార్థులకు భారతీయ భాషలలో ప్రతి ఏడాది శిక్షణ ఇస్తున్నది. జాతీయ సమైక్యతను పెంపొందించేలా కోర్సులను రూపొందించింది. ఒకపక్క భారతీయ భాషలపై అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లే కనిపించి మరోపక్క నిధులివ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ కేంద్రాలను మరింతగా విస్తృతపర్చుకుండా నామమాత్రంగానే నడుపుతున్నారు.
     ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక భారతీయ భాషా సంస్థాన్‌ ప్రాంతీయ కేంద్రాన్ని కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కిస్తే దాన్ని మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన సొంతజిల్లా నెల్లూరుకు తీసుకుపోయారు. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన 12.03.1954న ఏర్పాటయిన కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ఇప్పటివరకు 310 పుస్తకాలను తెలుగులోకి అనువదించి ముద్రించింది. 135 తెలుగు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువదించింది. ఏ రాజకీయ ప్రమేయం ఉండకుండా స్వయం ప్రతిపత్తి గల అకాడమీగా రూపుదిద్దుకోవాలని నెహ్రూ భావించాడు. రాజకీయరంగు కొద్దిగా పులుముకున్నా కొంతమేరకు పారదర్శకతగానే కొనసాగుతున్నట్టు కనబడుతుంది.
 

                                                       సంస్కృతం కలగలుపు నష్టదాయకం

   తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చడం వల్ల తెలుగుకు తీవ్ర నష్టం సంభవించడమే కాకుండా సంస్కృతంలో ఉన్న పురాణేతిహాసాలు తిరిగి మన మీద, ముఖ్యంగా విద్యావ్యవస్థ మీద రుద్ది, పురోగమనంలో పయనిస్తున్న సమాజాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. మన భాషలపట్ల మన జాతుల పట్ల గౌరవమే ఉంటే చేయాల్సిందిలా కాదు. మన రాష్ట్రంలో అనేక గిరిజన భాషలున్నాయి. వాటికి లిపిలేదు. గొప్ప సాంస్కృతిక వైభవం ఉంది. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంకు మాత్రమే లిపి ఉంది. ఈ కుటుంబంలో ఉన్న మిగతా భాషల సంగతేంటి? ఆ లిపిలేని భాషల్లో అనేకానేక జానపద విజ్ఞానముంది. దాన్ని వర్తమాన సమాజానికి అందిస్తే దాని వల్ల ఈ సమాజానికి భాషా వైభవం సంతరించి కొత్త విజ్ఞానం పరిచయమవ్వదా? శ్రీశైలం గిరిజన చెంచులకు లిపి లేదు. సుగాలీ భాషకు లిపి లేదు. వారి దగ్గర అమూల్యమైన ఆయుర్వేద విజ్ఞానముంది. భాష తెలిసినపుడే కదా ఆ విజ్ఞానం ఈ సమాజ అవసరాలకు ఉపయోగ పడేది. ఇవేవి చేయకుండా కుట్రపూరితంగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని తెలుగు అకాడమీలో మిళితం చేయడం తెలుగుజాతికి ద్రోహం చేసినట్టే.
 

- కెంగార మోహన్‌
94933 75447