Jan 09,2022 12:13

మనకు చాలా పండుగలు ఉన్నాయి. కానీ, అన్నిటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి. ఎందుకంటే- ఎక్కడ ఉన్న వారైనా అమ్మలాంటి ఊరికి చేరుకోవటం దీని ఆనవాయితీ. కుటుంబాలకు కుటుంబాలు కలవడం, మూడు నాలుగు తరాల జనం ఒక్కచోట చేరడం కళ్లకు కమనీయ వేడుక. ఇళ్లకు ఆనంద వేడుక. ఊళ్లకు ఉత్సాహ వేడుక. మనుషులంతా కలిసిన మహా సందడే సంక్రాంతి.

సంతోషాల సంక్రాంతి     సంక్రాంతి అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లడం.. మన మూలాలను, ఎదిగొచ్చిన గ్రామాలను సందర్శించటం.. కలిసి మెలసి పెరిగిన, తిరిగిన స్నేహితులను, సన్నిహితులను కలుసుకోవడం.. మనల్ని మనం చూసుకోవడం, మనలోకి మనం ప్రవహించటం.. మన చుట్టూ ఉన్న చేలను, చెట్లనూ, వ్యవసాయంలో సాయపడే పశువులను, సాధన సంపత్తినీ సత్కరించటం.. ఊరు ఊరంతా ఉత్సవమైన సన్నివేశంలో మనమొక గాలిపటమై ఎగరటం..
     అవటానికి ఇది మూడ్రోజుల పండగే కానీ, ముందూ వెనకా కలిపి ముప్పరు రోజుల సందడి, ఒక ఏడాది ఎదురుచూపు! సంక్రాంతి పెద్ద పండగ. ఎక్కడెక్కడో ఉన్న అందరినీ ఏకం చేసే పండగ. అత్తారిళ్లకు వెళ్లిన ఆడపిల్లలను, చదువులకో, బతుకుతెరువుకో బహుదూరం తరలిపోయిన ఆడ, మగపిల్లలను ఆత్మీయంగా ఆహ్వానించే పండగ. సంక్రాంతిని తలచుకోగానే మనసు సంబరంతో ఉరకలేస్తోంది. ఎన్నో జ్ఞాపకాలను తెరలు తెరలుగా గుబాళిస్తోంది.
    సంక్రాంతి రావడమే గొప్ప ఆహ్లాదకర వాతావరణంలో వస్తోంది. నులివెచ్చని చలి గిలిగింతలు పెడుతుంటే- వెండితెరల పొగమంచు ఎన్నో వర్ణ దృశ్యాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. చల్లని మంచు బిందువులు పూలబుగ్గలపై మంచిముత్యాల్లా మెరుస్తుంటాయి. అప్పుడే ఉదయించిన సూరీడి అరుణకిరణాలు ఆ జలముత్యాలకు పసిడికాంతులను ప్రసాదిస్తాయి. ఆ మూలన వారం రోజుల క్రితమే ఈనిన ఆవు అంబా అని మోరెత్తి పిలుస్తోంది. తల్లి పొదుగును కుడవడానికి లేగదూడ ఆరాటంతో గెంతులేస్తోంది. ఊరంతా ఆటలతో పాటలతో, నవ్వుల తుళ్లింతలతో కళకళలాడుతోంది. బిడ్డల సందడికి మురిసిపోయే తల్లిలా ఊరు ఆ మూడ్రోజులూ నిద్ర పోనేపోదు. కబుర్లతో, సందళ్లతో అమితానందం ఆస్వాదిస్తూ ఉంటుంది.
 

                                                                నెలరోజుల సందడి

సంక్రాంతి మూడు రోజుల పండగ కాదు, నెలరోజుల సందడి. నెలగంట మోగిన నాటి నుంచి వాకిళ్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ముగ్గులతో ముస్తాబవుతాయి. రథాల ముగ్గులూ, రతనాల ముగ్గులూ ఎప్పటికప్పుడు సరికొత్తగా సింగారించుకొని పోటీ పడతాయి. కొత్త బట్టల కొనుగోళ్లూ, హరిదాసుల సందళ్లూ, గంగిరెద్దుల పరవళ్లూ మొదలవుతాయి. ప్రతి ఇల్లూ సంక్రాంతికి సన్నద్ధమవుతుంది. ఆ ఏడాది పంటనుబట్టి, ఫలసాయాన్ని బట్టి - పెట్టుపోతలు ఉంటాయి. 'పండగ బట్టలు తీసేశారా? పిండివంటలు మొదలెట్టారా?' వంటి పలకరింపులు సర్వసాధారణమవుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పిల్లల కోసం, మనవళ్ల కోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతుంటాయి.
     ఇక దూరంగా ఉన్నవాళ్లకు కూడా నెలరోజుల నుంచే ఊరూ, ఇల్లూ క్షణక్షణానికీ గుర్తొస్తాయి. అమ్మకు ఏ రంగు చీర తీసుకెళ్లాలి? చెల్లికి ఏం కొనాలి? వంటి సంతోష సందిగ్ధాలు వెన్నాడుతుంటాయి. చిన్ననాటి స్నేహితులు, బంధువులూ కళ్లముందు కదలాడతారు. ఎప్పుడు ఊరెళతామా అన్న ఉబలాటం సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది. కుటుంబ సమేతంగా ఊరికి బయల్దేరడం ఎక్కడిలేని ఆనందం కలిగిస్తోంది. సొంత ఊరినీ, కన్నతల్లినీ, బంధుమిత్రులను కలుస్తామన్న హృదయానందం ఏ ప్రయాణం కన్నా అమితంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సంగతి సంక్రాంతి వేళ ఊరెళ్లే ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తోంది. సంక్రాంతి పూర్తిగా ప్రకృతి సంబంధమైన పండుగ. వ్యవసాయ ప్రధానమైన వేడుక. పంటలు చేతికొచ్చే పర్వదినం. వ్యవసాయ పనిపాటులన్నీ ముగిసి, కాస్త విరామం దొరికే సందర్భం. ఈ కాలంలో నెలకొనే వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. చెట్లూ మొక్కలూ పచ్చదనంతో పరవశిస్తూ ఉంటాయి. నదులూ వాగులూ నిండుగా ప్రవహిస్తాయి. పశుసంపద ఇబ్బడిముబ్బడై లేగదూడలతో కళకళ్లాడుతూ ఉంటుంది. లేలేత మొక్కల చివుళ్లపై మంచుబిందువులు మంచిముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి. పెరట్లో విరబూసిన బంతిపూలను రంగురంగుల సీతాకోకచిలుకలు ముద్దాడుతూ ఉంటాయి. ఎటుచూసినా ప్రకృతి కనువిందు చేస్తూ ఉంటుంది.
 

                                                                    ఎన్నో మార్పులు

సంతోషాల సంక్రాంతి

అయితే, మునుపటి పండుగ సందళ్లు ఇప్పుడు గ్రామాల్లోనూ లేవు. ఊళ్లు కూడా పట్టణాల్లాగానే మారిపోయాయి. వ్యవసాయం దారుణమైన ఒడిదుడుకులకు లోనవటమే దీనికి కారణం. పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు దక్కని పంటలూ, సాగు పద్ధతులూ వచ్చాయి. ఒకప్పుడు ప్రకృతి కరుణించకపోతే రైతుకు కాయకష్టమే పోయేది. ఇప్పుడు పీకల్లోతు నష్టాలొస్తున్నాయి. రైతు పండిస్తే ధర రాదు. పండించకపోతే తిరుగులేని గిరాకీ. పత్తి, పొగాకు, సరుగుడు, చెరకూ.. ప్రతి పంటా అంతే! సేద్యం ఇప్పుడు భరోసా ఇవ్వని వ్యాపకం. దీనికితోడు ప్రకృతి ప్రకోపాలు.. కరువూ వరద.. ఎప్పుడేమొస్తుందో! చిన్న రైతులు, వ్యవసాయ కూలీలూ అనివార్యంగా పట్టణాలకు వలసపోయే పరిస్థితి !
    పాడి పొంగి పొర్లడం లేదు. ఊరు మూతి బిగియకట్టుకొని, డెయిరీలకు పాలు పంపిస్తోంది! ఇక ఊరి సంస్కృతీ వేగంగా మారిపోతోంది. పట్టణంలాగానే పల్లెటూరి నెత్తి మీదా టెలివిజన్‌, దానికి రకరకాల ఛానెళ్లూ మొలిచాయి. సాంప్రదాయ కళలకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోయింది. హరిదాసులు, కొమ్మదాసులూ అన్ని ఊళ్లలోనూ కనపడడం లేదు. ఊళ్లో సందడికి ఇంతకముందు రాములోరి గుడో, రచ్చబండో వేదిక. అందరూ అక్కడికి చేరాల్సిందే! టీవీలొచ్చాక సంబరాన్ని ఉమ్మడిగా ఆస్వాదించలేని పరిస్థితి! కరోనా వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. అన్ని తరగతుల ఆదాయాలకు గండి పడింది. గతేడాది పండుగ సందడి బాగా తగ్గింది. ఇప్పుడూ కోవిడ్‌ భయం వెంటాడుతూనే ఉంది. ఉన్నచోటనే ఉండాలా? ఊరికి వెళ్లి రావాలా? అన్న సందిగ్ధం చాలామందిలో ఉంది.
 

                                                        ... అయినా, ఊరు ఊరే !

ఏ సంబంధాల్లో ఎన్ని మార్పులొచ్చినా, ఏ మహమ్మారులు ఎంత భయపెడుతున్నా అమ్మ అమ్మే! సొంత ఊరూ అంతే! చిన్నప్పుడు తిరుగాడిన నేలను తాకడం ఒక తన్మయత్వం. చిన్ననాటి చెలికాళ్లను కలవడం ఒక పారవశ్యం. చిన్నప్పుడు అమ్మతో కథలు చెప్పించుకున్న వేళప్పుడే.. ఇప్పుడు పిల్లలతో కలిసి అమ్మతో మాట్లాడడం ఒక ఆనందం. పొలంలోని పొన్నచెట్టు కింద నాన్నతో ముచ్చటించడం మహానందం. అక్షరాలు నేర్పిన బడిని, దిద్దించిన గురువునీ, చిన్ననాటి సాహసాల్లో భాగస్వాములైన సావాసగాళ్లనూ సందర్శించి సంభాషించడం.. అద్భుతానందం, ఆత్మీయ సంబంధం.
    మనకే కాదు, అమ్మకూ అంతే ! మన ఊరికీ అంతే ! చదువులకని, ఉద్యోగాలకని, ఉపాధికని ఊరొదిలి వెళ్లిన బిడ్డలు.. కలివిడిగా వచ్చి చేరితే అమ్మ ఆనందిస్తోంది. మనవళ్లనూ, మనవరాళ్లనూ మురిపెంగా చూసుకుంటూ చిన్నప్పటి గురుతులేవో వాళ్ల మాటల్లో చేతల్లో వెతుకుతుంటోంది. మన పిల్లల్లో మనకే తెలియని మన ఆనవాళ్లను పదిలంగా పట్టుకొని, ఆపాత మధురాలకు అన్వయిస్తోంది. ఇలా ఎన్నో విధాల బంధాలు మరింత బలపడ్డానికి పండుగ ఒక వేదిక అవుతుంది.
 

                                                               పాఠాలు నేర్పే పండుగ

సంతోషాల సంక్రాంతి

పట్టణాల్లో పుట్టి పెరుగుతున్న పిల్లలకు సంక్రాంతి ఒక గొప్ప జీవిత పాఠం. వ్యవసాయ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చినప్పటికీ- ఇప్పటికీ పరస్పర ఆధారసూత్రం గ్రామాల్లో కనిపిస్తుంది. దానిని పిల్లలకు విడమర్చి చెప్పవచ్చు. ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో బతుకుతున్నా- రోజువారీ ఆహారానికి గ్రామమే ఆధారం. పంటలు ఎలా పండిస్తారో, ఆ ప్రక్రియలో ఎవరెవరు ఎలా మమేకం అవుతారో, వాళ్లకు దక్కే ప్రతిఫలం ఎలా ఉంటుందో, దాన్లో ఉన్న సాధకబాధకాలు ఏమిటో పిల్లల వయస్సు, అవగాహన స్థాయిని బట్టి వివరించవచ్చు. మన గ్రామాలను, మూలాలను, ఉత్పత్తి సంబంధాలను అవగతం చేసుకునే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.
మామూలు మట్టిముద్ద క్షణాల్లో ఒక అందమైన కుండగా ఎలా మారిపోతుంది? పొడవాటి వెదురుకర్ర ఒక సాధారణ మనిషి చేతిలో ఒడుపుగా, వేగంగా ఎలా సన్నగా చీలిపోతుంది? చూస్తుండగానే ఏవిధంగా బుట్టలా రూపుదాల్చుతుంది? మనం తినే సన్న బియ్యం ఏ పొలంలో పండుతాయి? కూరగాయల సేద్యం వెనక ఎంత జాగ్రత్త పహారా కాస్తుంది? ఊళ్లోని గేదె పాలు లీటరు ఎంతకి అమ్ముడవుతాయి? పట్టణంలో మన ఇంటికొచ్చే ప్యాకెట్టు పాలకు ఎంత ఖర్చవుతుంది? రెంటి మధ్యా ఉన్న వ్యత్యాస ధర ఎవరికి చేరుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలను పట్టణాల్లో పెరిగిన పిల్లలకు విడమర్చి చెబుతుంది ఊరు. వీటిని పాఠాలుగా, ప్రశ్నలుగా కాదు; మాటలో మాటగా మూములుగానే చెబుతుంది. చూపులో చూపుగా సాధారణంగానే చూపిస్తుంది. ఏ పద్ధతిలో వివరించినా పిల్లలకు బోలెడు ప్రత్యక్ష విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జానపద కళలకూ, కళాకారులకూ సంక్రాంతి ఇప్పటికీ వేదికే! ఆదరణ తగ్గిందని అనుకున్నా ఏదొక రూపంలో ఈ కళలు కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటాయి. వీలైతే- పిల్లలకు హరిదాసు మాటలు వినిపించవచ్చు. గంగిరెద్దు వాని జీవితం పరిచయం చేయొచ్చు. కొమ్మదాసుడి కోతల్లోని హాస్యం రుచి చూపించవచ్చు. ఈ పండుగ.. అందరూ కలిసి ఉండడం, కలిసి పనిచేయడం, కలిసి ఆడడం, కలిసి పాడడం వంటి సామూహిక సందళ్ల సన్నివేశం. సమిష్టితత్వాన్ని పెంచి, సమున్నత భావాలను పెంపొందించడం ఈ పర్వదిన సందేశం.

                                                         ఆ ఆనందమే ఆనందం !

ఒకప్పుడు సంక్రాంతి అంటే సాంప్రదాయ సందళ్ల హడావిడి. పల్లెలు సంబరాలతో పరవశించి ఆడేవి. హరిదాసులు, కొమ్మదాసులు, తాడిపెద్దులూ, గంగిరెద్దులూ, కోలాటాలూ, కోల తిప్పడాలూ, పంటల మీదుగా తీర్థానికి తరలే ప్రభలూ, ఆ వెనక వందలాదిమంది ప్రజలూ... అంతటా ఒకటే సందడి! పండుగ తరువాత రోజుకొక్క ఊరు చొప్పున వరుసగా తీర్థాలు.. వాటికి బోలెడు ఆదరణ.. ఒకప్పుడు పిల్లలు ఏమి కొనుక్కోవాలన్నా తీర్థాలే దిక్కు. రంగులరాట్నం ఎక్కాలన్నా, బొమ్మల చక్రం చూడాలన్నా తీర్థానికి వెళ్లి తీరాల్సిందే! పక్క ఊరి తీర్థంలో రంగురంగుల కళ్లద్దాలు, ప్లాస్టిక్‌ వాచీలూ, లక్కపిడతలు, చెక్కబొమ్మలు, బూరలు, చేతికి ఉంగరాలు.. కొనుక్కొని, టింగురంగమని తిరగడం గొప్ప సరదా. వీటికోసం పిల్లలంతా కలిసికట్టుగా వెళ్లి, పెద్దల నుంచి తీర్థం డబ్బులు వసూలు చేయడం గొప్ప సాహసం! అన్నీ కొనుక్కోగా కొన్ని డబ్బులు మిగిల్చి, మూడుముక్కలాటలో ఏనుగు మీదో, గుర్రం మీదో పందెం కాయడం ఒక ఉత్కంఠ. వస్తాయనుకున్న డబ్బులు చెక్కబల్ల మీదికి కుప్పగా చేరిపోవడం ఖాయమే అయినా ఏదో చిన్ని ఆశ. తీర్థం నుంచి తిరిగొస్తూ- నాలుగు జీళ్లు కొనుక్కుంటే- ఇంటికొచ్చేదాకా సాగేవి. జీడిపాకం అన్న జాతీయం ఏ పరీక్షలో ఇచ్చినా ఈజీగా రాసేసే అనుభవం ఈ తీర్థంలోంచే వచ్చేది.
   తీర్థం జరిగే ఊరికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి తాడిపెద్దులు భజన బృంద సమేతంగా తరలివెళ్లేవి. పెద్దపెద్ద కంచు తాళాలను ఖంగుఖంగుమని మోగిస్తూ దాసులు పాటలు పాడేవారు. ఆ సందడి మధ్య దాసుడు మండుతున్న అగ్నికోలను ఒడుపుగా తిప్పుతూ విన్యాసాలు చేయడం వినోదంగా ఉండేది. సంక్రాంతి సందర్భంగా ప్రదర్శించే పౌరాణిక, సాంఘిక నాటకాలకు ఇసుకేస్తే రాలనంత జనం. పౌరాణిక నాటకాల్లో రాగం ఎంత లాగితే అంత గొప్ప. సాంఘిక నాటకాల్లో మాయల ఫకీరులా గంటల తరబడి నవ్వినవాడే విలన్‌ కింద లెక్క, గౌరవం. ఇవన్నీ తలచుకుంటే అదంతా ఇప్పుడొక వినోదం.

                                                         బంధాలూ అనుబంధాలూ..

సంతోషాల సంక్రాంతి

బతుకు కోసం, బాగు కోసం; చదువు కోసం, ఉద్యోగం కోసం పుట్టిన ఊరిని, కన్నవారిని వదిలి.. దూరాలకు వెళ్లడం నేడొక తప్పనిసరి అవసరం. 30, 40 ఏళ్ల నుంచి ఈ వలస వేగం బాగా పెరిగింది. కనీసం రెండు తరాలు పట్టణ వాతావరణంలోనే ఎదిగాయి. మారిన పరిస్థితుల్లో తరానికి, తరానికీ గ్రామాలతో, మూలాలతో ఎడం బాగా పెరుగుతూ వస్తోంది. పిల్లలకు మన కుదుళ్లను పరిచయం చేయటానికి, మనం బయల్దేరిన స్థానం ఏమిటో నేరుగా చూపటానికి సంక్రాంతి ఒక మంచి అవకాశం. ఎక్కడెక్కడో ఉన్న విడివిడి కుటుంబాలన్నీ ఒక ఇంట్లో కలివిడిగా, ఉమ్మడిగా కొద్దిరోజులు గడిపే సందర్భం ఇది. అమ్మానాన్న అన్న రెండు పిలుపులే కాదు; అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, చిన్నాన్న, పెదనాన్న, బుల్లి పిన్ని, మావయ్య, బాబాయి, అనంతపురం ఆంటీ, అమెరికా అత్త, పెద్దన్నయ్య, చిన్ని బావ ... ఇలా ఎన్నో పిలుపులూ ఆప్యాయతలూ పిల్లల అనుభవంలోకి వస్తాయి. అనుబంధాలు పెరగటానికి, ఇచ్చిపుచ్చుకోవడంలోని మాధుర్యాన్ని చవిచూడటానికీ దోహదపడతాయి. నాన్న చదువు ముందుకు సాగటానికి పెదనాన్న వ్యవసాయం చేయాల్సి వచ్చిందని తెలిసినప్పుడు- పిల్లలకు పెదనాన్న చాలా ఉన్నతంగా కనిపిస్తాడు. పదో తరగతి చదవటానికి అమ్మ రోజూ ఎంత దూరం సైకిలు తొక్కేదో విన్నప్పుడు- అమ్మలోని కొత్త కోణం అపురూపంగా తోస్తుంది. ఇలాంటి ఆపాత మధురమైన ఊసులకు సంక్రాంతి ఒక చక్కని వేదిక.

                                                      ప్రయోజనకరం.. పండుగ ప్రయాణం

సంతోషాల సంక్రాంతి

పండుగలో ఒకప్పటి వినోదాలూ సరదాలూ ఇప్పుడు అంత అపురూపంగా అనిపించకపోవొచ్చు. అయినా, వాటి ప్రత్యేకత వాటిదే! తీర్థం అంటే ఒకప్పుడు ఉన్న మోజు ఇప్పటి పిల్లలకు ఉండదు. ఎందుకంటే- ఈ తరం పిల్లలు ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ఒక ఏడాదిపాటు వేచి చూడక్కర్లేదు. ఏ షాపింగ్‌మాల్‌లోనో సులభంగా కొనిపించగలుగుతారు. అయినా, పిల్లలను కనీసం ఒక తీర్థానికైనా తీసుకు వెళ్లండి. చిన్నప్పటి మీ ఆనందాన్ని మీ పిల్లలూ ఆస్వాదించేలా చూడండి. పొలాన్ని, హలాన్ని పరిచయం చేయండి. సంక్రాంతి వ్యవసాయ పండుగ ఎలా అయిందో చెప్పండి. మీతోపాటు ఊరంతా తిప్పండి. ఊరుమ్మడి అవసరాలు ఎలా ఉంటాయో, ఎలా తీరతాయో వివరించండి. బంధుమిత్రులందరినీ పరిచయం చేయండి. బంధాలూ అనుబంధాలూ బలపడేది ఇప్పుడే! మీ మిత్రుల పిల్లలతో స్నేహం కలపండి. ఆర్థిక వ్యత్యాసాలూ, అంతస్థు అంతరాలూ ప్రదర్శించకుండా స్నేహాల, కుటుంబ సంబంధాల ఔన్నత్యం అర్థమయ్యేలా చూడండి. ఊరి మీద ప్రేమ, గ్రామీణ జీవనం మీద గౌరవం మీ పిల్లల్లో ఏమాత్రం మొలకెత్తించినా మీ సంక్రాంతి ప్రయాణానికి ఒక సరికొత్త ప్రయోజనం దక్కినట్టే !
     పండుగ మూడ్రోజులూ పరమానందంగా గడిచిపోతాయి. సెలవులు ముగిసిపోయాయి. స్కూళ్లూ, ఆఫీసులూ, మన పనులూ వెనక్కి రారమ్మని పిలుస్తూ ఉంటాయి. మళ్లీ వస్తామని అమ్మకీ, ఊరికీ, చెల్లికీ, స్నేహితులకీ చెప్పి వెనుదిరగాల్సి వస్తుంది. వచ్చినంత ఉత్సాహంగా ఉండదు, తిరిగి వెళ్లడం. అయినా, తప్పదు. అమ్మల కంట్లో కన్నీరు ఉప్పిల్లితుంటుంది. పిల్లలను చంక దించడం భారంగా అనిపిస్తోంది. సాగనంపటానికి వచ్చిన ఇంటిల్లిపాదితో సగం ఊరు బస్టాండు దగ్గరే ఉంటుంది. 'మళ్లీ వేసవి సెలవులకు వస్తాం.. బుజ్జమ్మ పెళ్లికి రెండ్రోజులు ముందే వస్తాం. నాన్నమ్మా.. వెళ్లొస్తాం.. అమ్మమ్మా.. మళ్లీ వస్తాం.' బైబైలూ వీడ్కోళ్లూ. బస్సు వస్తూ ఉంటోంది దూరంగా. వచ్చినప్పుడు ఉన్నంత సందడి ఉండదు ముఖాల్లో, మనసులో. బలమైన కుదురు నుంచి విడివడుతున్నట్టుంది. బతుకుతెరువు క్షేత్రం ఎక్కడైనా.. బతుకునిచ్చిన బంధం ఇక్కడే ఉన్నట్టు మళ్లీ మళ్లీ అర్థమవుతుంది. ఆ బంధానికి సంబంధించిన అందమూ ఆనందమూ అనుభవంలోకి తేవటమే ఈ పెద్ద పండుగ పరమార్థం !

                                                        ఇంటివంటల ఘుమఘుమలు

సంతోషాల సంక్రాంతి

సంక్రాంతి అంటేనే పిండివంటల సందడి. అరిసెలు, గారెలు, జంతికలు, సకినాలు, చెక్కలు, పోకుండలు, గవ్వలు, కజ్జికాయలు... ప్రాంతాన్ని బట్టి, ఇంట్లో అవసరం, అవకాశాలను బట్టి- వంటలు ముందుగానే సిద్ధం అయిపోతాయి. కురెకురేలూ, లేసులూ వంటి చిరుతిండ్లు బదులు ఈ ఇంటి వంటలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిలో రుచి, శుచి మాత్రమే కాదు; ప్రేమాభిమానాల రంగరింపూ ఉంటుంది.
     అలా అని వంటలన్నీ ఒకేలా ఉండవు. అమ్మమ్మ చేతి ఉలవచారు మహారుచి అని ప్రఖ్యాతి ఉంటుంది. భీమవరం అత్త వండే బూరెలు వెన్నలా కరిగిపోతాయని టాంటాం ఉంటుంది. బుల్లి పిన్ని పాళ్లు కలిపితే- జంతికలు గొప్ప కమ్మగా ఉంటాయనే నానుడి ఉంటుంది. ఇలా ఇంట్లో మనిషికొక బ్రాండు ఉంటుంది. వాళ్లు తయారుచేస్తుంటే- మిగిలినవారు సహాయపడుతుంటే- ఎంతో సందడిగా ఉంటుంది. కలివిడిగా, ఉమ్మడిగా అందరికోసం వండే వంటల్లో తీపి, పిండి, నూనె వంటి దినుసులే కాదు; కనిపించని ఆప్యాయతా కలుస్తుంది. అందుకేనేమో ఇంటివంటకు అంత అద్భుత రుచి !

సత్యాజీ
94900 99167