Oct 17,2021 20:51

ఇద్దరు మిత్రులు.. మరో స్నేహితుడికి కష్టమొచ్చింది.. ఆయన మూడు రోజుల శిశువుకు గుండె సమస్య.. వెంటనే ఆపరేషన్‌ చేయాలి.. చేతిలో డబ్బులేదు. విషయం తెలుసుకున్న ఇద్దరు మిత్రులు దాతల సహాయార్థం ఊరంతా తిరిగారు. డబ్బు సేకరించి ఆపరేషన్‌ చేయించారు. పసిప్రాణం నిలబెట్టి ఆ కుటుంబానికి జీవితకాలపు సంతోషాన్నందించారు. పసిబిడ్డ ప్రాణంతో మొదలైన వీరి సేవాపథం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ, నకిరేకల్‌ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర నరేష్‌, కర్నాటి నరేష్‌ మిత్రులు. ఐదారేళ్ల వ్యత్యాసం ఉన్నా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. పేరొక్కటే కాదు.. ఇద్దరి మనస్తత్వాలు, అభిప్రాయాలూ ఒక్కటే. తమ దగ్గర లేకపోయినా ఎప్పుడూ పేదలకు సహాయం చేయాలనే గుణం ఇద్దరిదీ. గతంలో పట్టణంలో 'లిటిల్‌ సోల్జర్స్‌' పేరుతో ట్యూషన్‌ సెంటర్‌ను నడుపుతూ వచ్చిన ఆదాయంలో కొంతమొత్తాన్ని పేద విద్యార్థుల చదువుకు, ఇతర సమస్యల్లో ఉన్న అభాగ్యులకు ఖర్చు చేసేవారు. కొద్ది కాలానికి కరోనా వల్ల ట్యూషన్‌ సెంటర్‌ మూతపడింది. అయినా వారి మార్గాన్ని వదులుకోలేదు.
కరోనా సమయంలో ఎంతోమంది పేదలు పని లేక, తిండి లేక అవస్థలు పడ్డారు. అలాంటి వారిని గుర్తించి 'ఫ్రీ రైస్‌ ఎటిఎం' పేరుతో వందల మందికి బియ్యం, కూరగాయలు అందించారు. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు తమ దగ్గన ఉన్న డబ్బుతో మంచినీళ్లు, అరటిపళ్లు అందించారు. అదిచూసి కొంతమంది ముందుకొచ్చి ఆహారం, మజ్జిగ ఇప్పించారు. పట్టణంలోని ఫంక్షన్‌హాళ్లలో ఏ కార్యక్రమం జరిగినా మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి పేదలకు, వికలాంగులకు, అనాథలకు ఇచ్చి వారి ఆకలి బాధలను తీరుస్తారు. అనాథాశ్రమాల్లోని చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ప్రమాదాలు, ఇతర కారణాలతో ఎవరికి రక్తం అవసరమైనా సమాచారం అందిన వెంటనే పనిలోకి దిగుతారు.
సహాయార్ధుల సమాచారాన్ని వేగంగా పంచుకోవడానికి 'లిటిల్‌ సోల్జర్స్‌ ఎట్‌ 200' పేరుతో ఒక వాట్సాప్‌ గ్రూపు నిర్వహిస్తున్నారు. ముగ్గురితో ప్రారంభమైన ఈ గ్రూపులో ప్రస్తుతం 120 మందికి పైగా సభ్యులున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.200 జమ చేసి వచ్చిన మొత్తాన్ని నిరుపేదలు, చిన్నారుల కోసం ఖర్చు చేస్తున్నారు. వీరు తెలుసుకున్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తమవంతు సహాయం అందించడంతో పాటు, వారి దీనగాథను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తారు. ఆ వీడియోలు చూసి ఎంతోమంది సహార్ధహృదయులు ముందుకువస్తున్నారు. వారి ఫేస్‌బుక్‌ చూస్తే ఎన్నో దీనగాథలు కన్పిస్తాయి.
ఆశ్రమాల్లోని అనాథలు, మానసిక వికలాంగుల కోసం బట్టలు సేకరిస్తారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఇంటికి రానీయకపోవడంతో పట్టణంలోని ఒక మైదానంలో 'మీకు అవసరం లేని బట్టలు, ఇతర వస్తువులు ఇక్కడ సంచిలో వేయండి' అని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వందలకొద్ది బట్టలు వచ్చి ఆ సంచీల్లో చేరాయి. మొక్కలు నాటే కార్యక్రమం, పక్షుల దాహార్తి తీర్చడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు.
భవిష్యత్తులో అనాథ పిల్లలకోసం ఆశ్రమం నెలకొల్పి సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఇద్దరు నరేషులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధి రీత్యా సంగారెడ్డిలో ఉంటున్న కె.నరేష్‌ ప్రతి ఆదివారం పూర్తి సమయాన్ని అభాగ్యుల కోసమే కేటాయిస్తాడు. స్థానికంగా ఉండే బి.నరేష్‌ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

స్నే'హితులు'

స్నే'హితులు'
ఈ స్నేహ ద్వయం అందిస్తున్న సేవలకు గాను పీస్‌ ఫౌండేషన్‌ 2020లో మహాత్మా గాంధీ గ్లోబర్‌ పీస్‌, కెజిఎన్‌ వారి మదర్‌ థెరిసా పీస్‌ అవార్డులు అందుకున్నారు. కరోనా వారియర్స్‌, ఆల్‌ ఇండియా ప్రెస్‌ వారి పురస్కారం, వరల్డ్‌ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ వారి కరోనా వారియర్స్‌, కాకతీయ నంది పురస్కారాలతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. అయితే పురస్కారాలు అందుకోవడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు భారీగా అవుతున్నాయనే ఉద్దేశంతో, అక్కడికి వెళ్లకుండా ఆ ఖర్చు మొత్తాన్నీ పేదల సహాయార్థమే వినియోగిస్తున్నారు.
కరోనా సమయంలో ఇంటికి దూరం : కె.నరేష్‌
కరోనా సమయంలో నా భార్య గర్భవతి. ఇంటికి వెళ్లకుండా కుటుంబాలకు దూరంగా మేమిద్దరం బయటే ఉండేవాళ్లం. మొదట్లో మావాళ్లు ఎందుకురా ఇవన్నీ అనేవాళ్లు. మా బాబుకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మా స్నేహితుల బృందమే సహాయం చేసింది. అప్పటి నుండి మా వాళ్లంతా ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని చూసి ఎంతో మంది దాతలు, సేవకులు ముందుకురావడం సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న వారి ముఖాల్లో ఆనందం చూసినప్పుడు తృప్తిగా ఉంటుంది.
నాన్నే నాకు స్ఫూర్తి : బి.నరేష్‌
పేదలకు మనకు ఉన్నంతలో తోచిన సహాయం చేయాలని మా నాన్న చెబుతుండేవారు. ఆయన మాటలే నాకు ప్రేరణ. మా పేదరికమే సేవామార్గం వైపు నడిపించింది. పేదలకు సహాయం చేయడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు నిర్వహిస్తున్న 'లిటిల్‌ సోల్జర్స్‌ ఎట్‌ 200' గ్రూపు తెలంగాణలో ఒక్కటే ఉంది. ఇలా కాకుండా ప్రతి గ్రామానికో బృందం తయారవ్వాలని కోరుకుంటున్నాం. 'రైస్‌ ఎటిఎం'ను 'గర్‌ కా చావల్‌'గా మార్చి ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేలా చేయాలనేది మా ఉద్దేశం.
- లక్ష్మి