May 24,2023 20:11

నిందితులను సమావేశంలో హాజరుపర్చిన డిఎస్‌పి, గోవిందరావు, సిఐ సింహాద్రి నాయుడు

ప్రజాశక్తి - లక్కవరపుకోట : మండలంలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన గోకాడ మహేశ్వరి (28) ఈనెల 18న హత్యకు గురైన విషయం తెలిసిందే. గేదెలవానిపాలెం రహదారిలో గల చిలకవాని చెరువు వద్ద తుప్పలలో ఆమె మృతదేహం లభించడంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితులను బుధవారం మీడియా ముందు హాజరు పరిచారు. విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం...
కల్లేపల్లి గ్రామ పంచాయతీలో గోకాడ మహేశ్వరి, గాడి చిన్నతల్లి ఇద్దరూ వెలుగు బుక్‌ కీపర్లుగా (విఒఎ) విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. చిన్నతల్లి తన విధినిర్వహణలో బ్యాంకు రుణాల లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడింది. అంతేకాకుండా మహేశ్వరి వద్ద కొంత నగదును అప్పుగా తీసుకుంది. తనకు రావలసిన అప్పు విషయంలో వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు తలెత్తాయి. ఇదిలా ఉండగా ఈనెల 17న బుక్‌ కీపర్లకు జిల్లా కేంద్రంలో రెండు రోజుల సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. తాను చేసిన అక్రమాలను ఆ సమావేశంలో అధికారులకు చెబుతాదేమోనని భావించిన చిన్నతల్లి... మహేశ్వరిని చంపేందుకు తన ప్రియుడు డెంకాడ వాసుతో కలసి పన్నాగం పన్నింది. సమావేశానికి వెళ్తున్నామని నమ్మబలికి ప్రియుడి కారులో మహేశ్వరిని ఎక్కించుకుని భీమసింగ్‌ ఆర్‌ఒబి కింద రోడ్డు వద్దకు చేరుకున్నారు. కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరి చేతులను చిన్నతల్లి గట్టిగా పట్టుకోవడంతో ఆమె ప్రియుడు వాసు చున్నీని మహేశ్వరి పీకకు గట్టిగా బిగించాడు. దీంతో మహేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య జరిగిన అనంతరం అక్కడనుండి చిన్నతల్లి జిల్లా సమావేశానికి వెళ్లగా.. మహేశ్వరి మృతదేహాన్ని కారులో గేదెలవానిపాలెం రహదారిలో గల చిలకవాని చెరువు వద్దకు వాసు తీసుకొచ్చి తుప్పల్లో పడేశాడు. హత్య కేసును వివిధ కోణాలలో పోలీసులు విచారించడంతో భయభ్రాంతులకు గురైన హంతకులు దూర ప్రాంతాలకు పోయి జీవించాలనుకున్నారు. పోలీసుల నుండి వీరు తప్పించుకోవడానికి అదే గ్రామానికి చెందిన కోరాడ సాయికుమార్‌ను సాయం కోరడంతో వీరు ముగ్గురు గ్రామాన్ని విడిచి వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. గంగుబూడి ప్రాంతం వద్ద పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. హంతకులిద్దరూ తెప్పించు కోవడానికి సహకరించిన సాయికుమార్‌ను ఎ3 ఛార్జి షీటులో చేర్చారు. ఈ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌.కోట సిఐ ఎస్‌.సింహాద్రినాయుడు, ఎల్‌.కోట ఎస్‌ఐ ఎం.ముకుందరావు, కానిస్టేబుళ్లు ఎం.పోతురాజు, ఎ.రమేష్‌ కుమార్‌లను డిఎస్‌పి గోవిందరావుతో పాటు జిల్లా ఎస్‌పి ఎం.దీపిక అభినందించారు. సమావేశంలో వేపాడ ఎస్‌ఐ కె.రమేష్‌, ఎల్‌ కోట ఎఎస్‌ఐలు యువరాజు, గోవిందరావు పాల్గొన్నారు.