Mar 19,2023 01:22
పర్చూరులో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్‌ సత్తార్‌

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: శనగల కొనుగోళ్లు త్వరలో జరుపుతామని జిల్లా వ్యవసాయాధికారి షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌ తెలిపారు. పర్చూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఏడిఏ మోహన్‌రావు అధ్యక్షతన సబ్‌ డివిజన్‌లోని 4 మండలాల ఆర్‌బికె సిబ్బంది, విఏఏలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సత్తార్‌ మాట్లాడుతూ ఈనెలాఖరు లోపు రైతులు సిఎం కిసాన్‌ ఈకెవైసి చేయించుకోవాలని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు రావాలంటే రైతులు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. త్వరలో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్వింటాకు రూ.5,335 చొప్పున కొనుగోలు చేస్తామని, శనగలు అమ్ముకునే వారు ఈ నెల 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేయించాలని విఏఏలకు సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటల పరిస్ధితిపై వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి ఎస్‌ రామమోహన్‌రెడ్డి, ఏఇఓలు పాల్గొన్నారు.