Oct 18,2020 22:25

దెబ్బతిన్న వేరుశనగ పంట

- సాగు పెరిగినా తగ్గనున్న దిగుబడి
- ఆందోళనలో రైతన్నలు
           ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి/ఆదోని రూరల్‌: అధిక వర్షాల దెబ్బ వేరుశనగ రైతుల మీద కూడా పడింది. వేరుశనగ సన్నగిల్లుతోంది. గత ఏడాది కన్నా జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు పెరిగినా దిగుబడి మాత్రం తగ్గుతోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసినా సరైన దిగుబడి రాకపోవడంతో రైతన్నల్లో ఆందోళన నెలకొంది....

           జిల్లాలో ఈ ఏడాది వేరుశెనగ సాగు పెరిగినా దిగుబడి తగ్గనుంది. జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు 88,266 హెక్టార్లు కాగా ఈ ఏడాది 97,850 హెక్టార్లలో రైతులు వేరుశనగను సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ మొదట్లో విత్తనాలు విత్తే సమయంలో వర్షాలు సరిగా కురవకపోయినా చిరుజల్లులు కురవడంతో రైతులు ఆశతో విత్తనాలను వేశారు. విత్తనాలు వేసిన రెండు వారాలు ఆశించిన స్థాయిలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు పెరిగింది. నీటి సౌలభ్యం కూడా పెరగడంతో మొదట వేరుశనగ సాగుకే రైతన్న ప్రాధాన్యమిచ్చాడు. తరువాత వర్షాలు అధికంగా కురవడంతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోయింది. అధిక వర్షాల వల్ల మొక్కలు అధికంగా పొడవు పెరగడం వల్ల కాయలు దిగుబడి గణనీయంగా పడిపోయింది. అధిక వర్షాల వల్ల కలుపు కూడా ఎక్కువ కావడంతో వేరుశనగ రైతుకు భారీ దెబ్బ పడింది. విత్తనాలు మొదలు కూలీల ఖర్చుల వరకూ రైతులు ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకూ వెచ్చించి పంటను సాగు చేశారు. అధిక వర్షాల వల్ల ఆశలు మొత్తం అడిఆశలయ్యాయి. దిగుబడి ఆశాజనకంగా రాకపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చేటట్లు లేవని రైతులు బోరుమంటున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతంలో చాలా వరకూ పంటలు నీట మునిగాయి. అలా కొన్ని ఎకరాల్లో వేరుశనగ కూడా నీటిపాలై రైతులు పూర్తిగా నష్టపోయారు. నష్టాన్ని అంచనా వేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగమయ్యారు. కొన్నిచోట్ల రైతు పండించిన పంట దిగుబడి కూడా దక్కడం లేదు. ప్రస్తుత మార్కెట్‌ ధరల విషయంలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ఆరబోసి ఎండుకాయలు అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం సాగు అధికంగా ఉండటంతో మార్కెట్‌ ధరలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో పచ్చి వేరుశనగను మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతంలో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వేరుశనగ రైతులు కోరుతున్నారు.
అప్పులే మిగిలాయి...
              అప్పు చేసి విత్తనాలు కొని 3 ఎకరాల 20 సెంట్లలో వేరుశనగ వేశాను. కానీ అధిక వర్షాల వల్ల పంట చేతికి రాలేదు. అసలు పంట పండలేదు. మొత్తం వేర్లు మాత్రమే మిగిలాయి. విత్తనం ఖర్చు, మందులు, కూలీలు, పెట్టుబడి ఇలా మొత్తం రూ.40 వేల దాకా ఖర్చు అయ్యింది. కనీసం పశుగ్రాసం కోసం కూడా పంట చేతికి రాలేదు. ఇంకా దున్ని వేయడం మాత్రమే మిగిలింది. అప్పులు తప్ప ఏమీ మిగలలేదు.
                                                                                          - వి.సోమన్న, రైతు, తడకనపల్లి, కల్లూరు మండలం