
అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు మండలంలో పెద్ద యక్కలూరు గ్రామానికి చెందిన హబీబ్‌బాషా (36)కు మూడెకరాల పొలం ఉంది. అయితే, తనకున్న రెండు ఎడ్లలో ఒకటి జబ్బుచేసి చనిపోయింది. అప్పుచేసి రెండో ఎద్దుని కొన్నాడు. కొద్దిరోజులకే అదీ చనిపోయింది. ఒక దాని తర్వాత ఒకటి అలా రెండు ఎడ్లూ చనిపోవడం బాషాకు ఎంతో బాధ కలిగింది. ఇక తన పొలంలో ట్రాక్టర్‌తోనే దున్నాలనుకున్నాడు. కాని అందుకు అతడి ఆర్థిక స్థోమత సరిపోలేదు. తక్కువ ఖర్చుతో... ఒక యంత్రాన్ని తయారు చేసుకోవచ్చని అతడి స్నేహితుడు సలహా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వివరాల్ని తెలిసిన వారందరితో చర్చించాడు. ఆ క్రమంలో రీ అసెంబ్లింగ్ పద్ధతి గురించి తెలుసుకున్నాడు. ఆ పద్ధతికి అవసరమైన కొన్ని భాగాల్ని అమర్చి పొలం పనుల కోసం ఓ యంత్రాన్ని చేయవచ్చని తెలుసుకున్నాడు. డబ్బు ముందుగా పెట్టుకోలేని కారణంగా అతడికి తెల్సిన కొందర్ని సాయం చేయాలని కోరాడు. అలా వారి సాయంతో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే, అవి సరిపోలేదు. దాంతో అంచెలంచెలుగా ఆ యంత్రాన్ని తయారు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అలా అతడి వద్ద డబ్బులున్నప్పుడు స్టీరింగ్, టైర్లు, అందుకు అవసరమైన ఇనుముని కొన్నాడు. బాషా కొంతకాలం మోటార్ రీవైండింగ్, లేత్ వర్క్, వెల్డింగ్ పనులు చేశాడు. ఆ అవగాహన అతనికి ఈ యంత్రాన్ని స్వయంగా తయారు చేసుకునేందుకు ఉపయోగపడింది. ముందుగా ఆ యంత్రానికి కావాల్సిన వస్తువులు, దాని ఖర్చుని బేరీజు వేసుకుని ధైర్యంగా మొదలు పెట్టాడు. అలా ప్రారంభించిన బాషా ఏడాది పాటు శ్రమించి రూ.60 వేలు ఖర్చు చేసి ఓ మినీ ట్రాక్టర్‌నే రూపొందించాడు. అయితే, దానికి ట్రాక్టర్‌కు ఉండాల్సిన హంగులూ ఆర్భాటాలు లేవు. అయితేనేం... అది తన పొలంలో అవసరానుగుణంగా పనిచేస్తే చాలనుకున్నాడు. ఆ మినీ ట్రాక్టర్లో ఓ డీజిల్ ఇంజన్ అమర్చాడు. దాని ఖరీదు 8,500 రూపాయలు. ఈ ట్రాక్టర్ ద్వారా పురుగు మందులను పిచికారీ చేసుకునేలా డిజైన్ చేశాడు. కమాండర్ జీప్‌కు వచ్చే గేర్ బాక్స్‌ను అమర్చాడు. అలా టాప్‌లెస్‌గా ఓ రూపాన్ని తీసుకొచ్చాడు. రూ.400ల డీజిల్ పోసుకుంటే దానితో ఆరు గంటల పాటు వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. అయితే సొంత ఊరిలో పంటలు సరిగ్గా పండని కారణంగా బాషా తన అత్తగారి ఊరైన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వెళ్లాడు. అక్కడి పంట పొలంలో సాగు చేసేందుకు ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనానికి లైటింగ్ సమస్య ఉంది. దానిని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తానని బాషా అంటున్నాడు.
ప్రస్తుతానికి అత్తగారి ఊరిలో వారి మూడెకరాల పొలంలో ఈ యంత్రం సాయంతో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. పొలం పనుల్ని చేసుకునే చిన్న, సన్నకారు రైతుల బాధలు తెలిసిన బాషా తాను తయారు చేసిన ఈ మినీ ట్రాక్టర్ని తోటి రైతుల పొలం పనులకు ఇస్తున్నాడు. కాస్తో కూస్తో డబ్బు ఇవ్వగలిగినవారుంటే తక్కువ అద్దెకు అందజేస్తున్నాడు. మరింత డబ్బు పెట్టుకోగలిగితే... వారికీ తక్కువ ఖర్చుతో ట్రాక్టర్ని తయారు చేసి ఇస్తానని అంటున్నాడు. బాషా చదువుకున్నది తొమ్మిదో తరగతి అయినా పట్టుదలతో, తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యంత్రాన్ని రూపొందించాడు. తోటి రైతుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నాడు.
- వర్థని