Jul 29,2021 23:20

- స్వాహా అయినది రూ.22.69 కోట్లు
- వివరాలు వెల్లడించిన ఎస్‌పి మల్లికా గార్గ్‌
ప్రజాశక్తి-వేటపాలెం: 
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన వేటపాలెం ది కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ గోల్‌మాల్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులతో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌పి మల్లికా గార్గ్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. సొసైటీలో 1737 మంది షేర్‌ హోల్డర్లు రూ.22.69 కోట్ల మేర నగదు దాచుకున్నారు. వీటిని ప్రధాన నిందితులైన శ్రీరాం శ్రీనివాసరావు స్వాహా చేసినట్లు చెప్పారు. అతనితో పాటు సొసైటీ ప్రెసిడెంట్‌ వలివేటి నాగేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ వల్లంపట్ల రామలింగస్వామి, డైరెక్టర్లు చిలంకూరి ఆంజనేయగుప్తా, కోడూరి రాజేంద్రప్రసాద్‌, నూనె మోహన్‌ కృష్ణ, కొలిశెట్టి వెంకట సత్యనారాయణ, రాయవరపు శ్రీనివాసరావులు ఆర్థిక నేరానికి పాల్పడినట్లు తెలిపారు. సొసైటీలో 1330 ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లు, 138 రికరింగ్‌ డిపాజిట్లు, 850 సేవింగ్‌ డిపాజిట్లు ఉన్నాయని వివరించారు. గత 30 ఏళ్లుగా శ్రీరామ్‌ శ్రీనివాసరావు సొసైటీ సభ్యులతో సెక్రటరీగా, మేనేజర్‌గా ఎన్నిక కాబడుతున్నట్లు చెప్పారు. డిపాజిట్‌దారుల సొమ్మంతా ఎల్‌ఐసి బాండ్స్‌, భూములు, ఫ్లాట్లు, ఇళ్లు, బంగారం రూపంలో రూ.5 కోట్ల మేర పెట్టుబడి పెట్టారన్నారు. మిగిలిన నగదును వివిధ మార్గాల ద్వారా దాచిపెట్టుకున్నాడని చెప్పారు. ఇందుకు డైరెక్టర్ల సహకారం పూర్తిస్థాయిలో ఉందన్నారు. ఖాతాదారుల డబ్బులు రాబట్టేందుకు శ్రీరాం శ్రీనివాసరావు, అతని భార్య, డైరెక్టర్ల బ్యాంకు లావాదేవీలను నిలుపదల చేయవలసినదిగా బ్యాంకు మేనేజర్లకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలను గాలించేందుకు జిల్లా అడిషనల్‌ ఎస్‌పి చౌడేశ్వరీ ఆధ్వర్యంలో చీరాల డిఎస్‌పి పి.శ్రీకాంత్‌ను నియమించినట్లు చెప్పారు. సిబ్బందిని ఆమె అభినందిచారు. ముద్దాయిలను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో చీరాల రూరల్‌ సిఐ రోశయ్య, ఇంకొల్లు సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ కె.కమలాకర్‌ పాల్గొన్నారు.
ఎవరూ భయపడొద్దు.. ధైర్యంగా ఉండాలి: ఎస్‌పి
సొసైటీ బాధితులెవ్వరూ భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అని ఎస్‌పి మల్లికా గార్గ్‌ భరోసా ఇచ్చారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలుసుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడును వెల్లబోసుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. . రెండు గంటల పాటు నిలబడ్డారు. విలేకర్ల సమావేశం అనంతరం ఎస్‌పి బాధితులతో మాట్లాడారు. 'మందులకు కూడా డబ్బులు లేవమ్మా.. దాచుకున్న డబ్బులు మొత్తం పోయాయి' అని ఓ మహిళ బోరున విలపించింది. ఎస్‌పి మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేశాం. తమ వద్ద ఉన్న బాండ్లు, ఇతర రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. తొలుత వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లి, రామన్నపేట పంచాయతీలలోని సచివాలయాలను అకస్మికంగా తనిఖీ చేశారు.