
మరలా త్రిసభ్య కమిటీలకే బాధ్యతలు
ప్రజాశక్తి - కాళ్ల
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల త్రిసభ్య కమిటీల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013లో ఎన్నిక ద్వారా ఏర్పాటైన పాలకవర్గం పదవీకాలం ముగిసిపోగా, అప్పటి నుంచి ఎన్నికల ఊసే లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమించారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత త్రిసభ్య కమిటీలను కొనసాగిస్తోంది. ప్రస్తుత కమిటీల గడువు జనవరి 31తో ముగియడంతో అవే కమిటీలను కొనసాగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 258 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 144 సహకార సంఘాలు ఉన్నాయి. 107 సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు, రెండు సహకార సంఘాల పర్సన్ ఇన్‌ఛార్జిలకు మరో ఆరు నెలల పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికలు నిర్వహించకుండా..
ఐదేళ్ల పదవీ కాలం ఉండే సొసైటీ పాలక వర్గాల ఎంపికకు 2013లో ఎన్నికలు నిర్వహించారు. పదవీ కాలం 2018 జనవరితో ముగియగా ఎన్నికలు జరపకుండా అప్పటి ప్రభుత్వం ఆయా పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల చొప్పున మూడు విడతలు పొడిగించింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం పిఎసిఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా దానికి భిన్నంగా ఎంఎల్‌ఎలు, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిల సిఫార్సు చేసిన వారికి త్రిసభ్య కమిటీ సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే.
కమిటీలతో కాలయాపన..
రైతుల ప్రయోజనానికి ఉద్దేశించిన సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల పలు గ్రామాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి పాలకవర్గాలు లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. త్రిసభ్య కమిటీలకు విధానపర కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడం, ఆరు నెలలే పదవీ కాలమన్న భావనతో పిఎసిఎస్‌ల అభ్యున్నతి, రైతు ప్రయోజనాలు పట్ల పూర్తిస్థాయి దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఫలితంగా కొన్ని సహకార సంఘాల్లో అవకతవకలు చోటుచేసుకునే ఆస్కారం ఏర్పడుతోంది. ఏదేమైనా ప్రభుత్వం సహకార సంఘాల విషయంలో కమిటీలతో కాలయాపన చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే మేలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.