
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెపుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 163 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 123 ఉన్నాయి. V పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జె.సి మయూర్ అశోక్, డిఆర్‌ఒ గణపతి రావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, సూర్యనారాయణ, సుదర్శన దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
దూరవిద్యా కేంద్రాన్ని మూసివేయొద్దు
ఎంఆర్ కాలేజీలోగల దూర విద్యా కేంద్రాన్ని మూసివేసి జిల్లాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం పావులు కదపడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్ పావని, అన్నారు. దూర విద్యా కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ సోమవారం స్పందనలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ జిల్లాలో గత 30ఏళ్లగా విద్యార్థులు ఈ దూర విద్యా కేంద్రం ద్వారా విద్యను కొనసాగిస్తున్నారని, తెలిపారు. ఉన్నపలంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఎత్తివేయడం సరికాదన్నారు. ఈ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాడు తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాము, ఎం.సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన
జిల్లాపోలీసు కార్యాయంలో ఎస్‌పి ఎం.దీపిక వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.