
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్
ప్రజల సమస్యలు మన సమస్యలుగా భావించినప్పుడే సత్వర న్యాయం అందించగలమని జిల్లా ఎస్పీ పి. జాషువా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందనలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులను సోమవారం స్వయంగా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తారన్నారు. అలాంటి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సత్వర న్యాయ అందించే దిశగా అడుగులు వేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్పందనలోని ఫిర్యాదులు : ఆస్తి కోసం తన కొడుకు దాడికి పాల్పడుతూ తన పేర రాయకుంటే ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడనని బెదిరిస్తున్నాడని పెడనకు చెందిన వద్ధుడు సూర్య నారాయణ న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. దుర్వ్యసనాలకు బానిసై తన భర్త అధిక కట్నం కొసం వేధింపులకు గురిచేస్తూ భౌతిక, శారీరిక దాడికి పాల్పడి గర్బస్రావంకు కరకుడయ్యాడని గన్నవరం నుండి నవీన అనే మహిళ ఫిర్యాదు చేసింది. సన్మార్గంలో నడిపించేలా సహాయం చేయమని ఎస్పీని కోరింది. మరణించిన తన భర్తకు వచ్చిన ఇన్సూరెన్స్ క్లైమ్స్ సంబంధించిన డబ్బులు, ఏటీఎం కార్డ్డులు స్వాధీనం చేసుకొని అందులో ఉన్న నగదును ఖాళీ చేశారని, నకిలీ డాక్యుమెంట్స్ సష్టించి కూతురు పేరు ఉన్న ఆస్తిని రాయించుకున్నారని పమిడిముక్కల నుండి నాగలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇంటికి సరిహద్దుదారులుగా ఉన్నవారు మా స్థలాన్ని ఆక్రమించుకుని దుర్భాషలాడుతూ ఇంటిలో ఉండ నివ్వటం లేదని న్యాయం చేయమని బంటుమిల్లి కి చెందిన నరేష్ ఫిర్యాదు చేశారు.