Aug 08,2022 07:10

వాళ్ళను ఎప్పుడైనా చూశారా ?
నిప్పుల వానలో నిత్యం తడుస్తుంటారు
కత్తుల వంతెనపై తెగించి నడుస్తుంటారు
తీవ్ర గండం చుట్టుముట్టినప్పుడు
ప్రజ ప్రాణావనోత్సాహంతో
తక్షణం వాళ్ళు ప్రత్యక్షమవుతారు
ప్రమాదపు చివరి అంచున వేలాడుతున్న
దు:ఖనదులను ఆదరంగా చేరదీస్తారు
ఉపద్రవంలో మునిగిపోతున్న
ఊపిరి దివ్వెలను పచ్చగా దీవిస్తారు
వైరస్‌ రగిలించిన తిమిర సముద్రంలోనో ,
పోటెత్తే వరద ఎడారిలోనో
ప్రతిధ్వనించే ఆర్తనాదాలను
ఓదార్పు ఒడ్డుకు చేరుస్తారు!
పంచభూతాల ప్రళయ నాట్యంతో
చెలరేగిన ప్రకృతి వైపరీత్యంలో
కన్నీరు మున్నీరవుతున్న గాయాలపై
అమ్మలాగా ఉపశమన లేపనం కురిపిస్తారు!

ఆ కరుణాసింధువులను ఎప్పుడైనా చూశారా?
నెత్తురోడుతున్న నిలువెత్తు మాంసపు ముద్దలను
అమాంతం గుండెలకు హత్తుకొని
ఛిద్ర దేహాలను భద్రంగా మోసుకొస్తారు
అనుబంధాలను విడిచిపెట్టి
విపత్తురణంలో కాలాన్ని కరిగించుకునే
ఆ ధీరయోధుల పాదధూళిని
మనసునిండా స్ఫూర్తిగంధంగా రాసుకుందాం
మృత్యువుకు కూడా ముచ్చెమటలు పట్టించే
ఆ సాహస వీరుల అనంత సేవానిరతిలో
అణువంతైనా ఆవహన చేసుకొని
మనుషులుగా జీవిద్దాం!
( రక్షణ దళాల అసమాన సేవలను స్మరించుకుంటూ ....)
- కోయి కోటేశ్వరరావు
94404 80274