Jan 18,2022 07:10

  • నేడు తాడేపల్లి లోని ప్రజాశక్తి భవన్‌లో
  • కా|| డి.వి.ఎస్‌ హాలు ప్రారంభోత్సవం సందర్భంగా

'కామ్రేడ్‌ డివియస్‌' అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే కా||డి.వి.సుబ్బారావు ఆదర్శ కమ్యూనిస్టు. కమ్యూనిస్టుగా ఆయన సల్పిన కృషి 20 సంవత్సరాలే అయినా ఆయన ''తమ తరానికి ఆదర్శప్రాయుడు'' అని డి. బిక్షావతి గారికి పంపిన సంతాప సందేశంలో పుచ్చలపల్లి సుందరయ్య పేర్కొన్నారు. ''పార్టీ జీవితంలో ఆంధ్ర ప్రజల మార్గం మూల మలుపులో ఉన్నప్పుడు పార్టీకి డివియస్‌ మార్గదర్శకుడయ్యాడ''ని మాస్కో నుండి రాసిన ఆ ఉత్తరంలో సుందరయ్య పేర్కొన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలు నుండి మోటూరు హనుమంతరావు గారు పంపిన ఉత్తరంలో ''నడి వయస్సులోనే అస్తమించినా కమ్యూనిస్టులు అందరూ గర్వించదగినట్లే అర్హత పొందాడు డివియస్‌'' అని పేర్కొన్నారు. ''డి.వి సుబ్బారావు ఏ వర్గం కోసం అయితే పరిశ్రమించాడో వారికి ఆయన మరణం తీరని నష్టం కల్గించింద''ని ఎ.కె.గోపాలన్‌ పేర్కొన్నారు. 1949లో కడలూరు జైలులో డివియస్‌ యువకుడిగా మా అందరి దృష్టిని ఆకర్షించాడు అని పేర్కొన్నారు. డివిఎస్‌ మరణం గురించి ప్రముఖ అభ్యుదయ రచయిత సి.వి. ''పిడుగు లాంటి వార్త వినిపించి...మా గుండెల్లో భూకంపాలు పుట్టించావుగదయ్యా'' అన్నాడు. ఇంకా ఇలా రాశారు: ''నలబై తొమ్మిదిలో నరరూప రాక్షసులు తెలుగు ఆడపడుచుల మానాల్ని చెరుస్తోన్న దినాల్లోనూ, నూనూగు మీసాల నూతన యవ్వనంలో విద్యార్థిగా ఉన్న నిన్ను పళనియప్పని పోలీసులు పార్టీ రహస్యాలు చెప్పమని కీలు కీలు విరగ్గొట్టారు. కడలూరు జైలులో ఫాసిస్టులు నీకు దేవతా పులుసు రుచి చూయించారు'' అని రాశారు. ''మరణ వార్త వినగానే లోకమంతా కారుచీకట్లు కమ్ముకున్నంత పనైంద''ని డిటెన్యూల కుటుంబ సభ్యుల తరఫున కర్నూలు నుండి టి. లక్ష్మమ్మ ఉత్తరంలో పేర్కొంది. జైల్లో ఉన్న మానికొండ సూర్యావతి గారు తన సంతాప సందేశంలో ''జైల్లో డిటెన్యూలందరం ఒక్కసారిగా తల్లడిల్లిపోయాం'' అంది.
 

                                                కమ్యూనిస్టు ఉద్యమంలోకి డివియస్‌

స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు ఉద్యమం డివిఎస్‌ను ఆకట్టుకుంది. 1944లో విజయవాడలో జరిగిన రైతు మహాసభకు వలంటీరుగా పని చేశాడు. బ్రిటీషు వాళ్ళకు దేశంలో మద్దతిస్తున్న జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చిన పిలుపు డివియస్‌ మీద బలమైన ముద్ర వేసింది. కుటుంబం భూస్వామ్య కుటుంబం. తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేకి. అయినా తమ సొంత ప్రయోజనాల కంటే దేశం, ప్రజలు ప్రయోజనాలు ముఖ్యమని భావించి ఎర్రజెండా పట్టాడు.
    1948 మే నెలలో వివాహం చేసుకోగానే బందరులో బి.ఎ చదువుకొంటూ కాపురం పెట్టాడు. రహస్యంగా ఒక డెన్‌కి బాధ్యత వహించాడు. కొరియర్‌గా పనిచేయ పూనుకొన్నాడు. కరపత్రాలు, సర్క్యులర్లు తయారు చేసి పంపకం చేసే బాధ్యతల్లో ఉండగా అరెస్టయ్యాడు. రహస్యాలను రాబట్టడానికి చిత్రహింసలు పెట్టారు. కీలు కీలు విరగ్గొట్టినట్లు నాడు పత్రికలు ప్రచురించాయి. కడలూరు జైలుకు పంపి నిర్బంధించారు. పళనియప్పన్‌ పోలీసుల దెబ్బలు నుండి చాలా కాలం కోలుకోలేదు. సుందరయ్య గారు ఈ దెబ్బలు గురించి కూడా తన ఆత్మకథలో పేర్కొన్నాడు. దీన్నిబట్టి డివియస్‌ రాజకీయ దృఢత్వం ఎంత బలమైందో బోధపడుతోంది.
   ఉమ్మడి పార్టీలో విశాలాంధ్ర పత్రికను అభివృద్ధి చేయడానికి అహరహం శ్రమించారు డివిఎస్‌. భవన నిర్మాణం పని నుంచి యంత్రాలను విదేశాల నుంచి రప్పించి వాటిని నడిపించే వరకూ అన్ని రకాల పనులూ చేశారు.
 

                                                             డివియస్‌ ప్రత్యేకత

పార్టీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు రాజకీయ బాధ్యతను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిర్వహించాడు డివిఎస్‌. దేశ భవిష్యత్తు కోసం బూర్జువా, భూస్వాములకు కొమ్ము కాసే కాంగ్రెస్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడ్డం కీలక కర్తవ్యం అయ్యింది. ఈ సమస్య పార్టీలో పెద్ద వివాదమైంది. పాలక వర్గాలు ఇండియా-చైనా సరిహద్దు సమస్యను సాకుగా తీసుకొని రాజీ లేని వర్గ పోరాట మార్గాన్ని స్వీకరించిన కమ్యూనిస్టులను అణచడానికి దేశద్రోహ చట్టాన్ని వినియోగించి ఒక్క ఆంధ్ర లోనే 200 మందిని డిటెన్యూలుగా జైళ్ళలోకి నెట్టారు.
    విశాలాంధ్ర పత్రిక సంస్థ నిర్వహణలో ఉండగా ఈ సిద్ధాంత వివాదం రావడం, నాయకులంతా జైళ్ళపాలు కావడం లాంటి పరిణామంలో సరైన రాజకీయ పంథా కోసం 1963 జూన్‌ 23న జనశక్తి పత్రికను ప్రారంభించి కమ్యూనిస్టుల్ని పోరాట పంథా వైపు నిలబెట్టే పాత్ర పోషించాడు. నాయకులందరూ జైళ్లలో వున్న సమయంలో ఈ రాజకీయ కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇదే కామ్రేడ్‌ డివిఎస్‌ యొక్క కమ్యూనిస్టు కృషి ప్రత్యేకత. తన భార్య మెడ లోని పుస్తె దగ్గర నుండి తన సొంత ఆస్తితో సహా సమీకరించి పార్టీని కాపాడే పని జనశక్తి ద్వారా నిర్వహించాడు. వర్గ పోరాటానికి కట్టుబడి ఉండే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని (మార్క్సిస్టు, లెనినిస్టు విధానాలకు) సిపిఐ(ఎం)కు గుర్తింపు తెచ్చాడు. జనశక్తి అనతి కాలంలోనే ద్వైవార పత్రికగా అభివృద్ధి అయ్యింది. ఆ రోజుల్లో డివియస్‌ స్వయంగా తానే రచయితగా కూడా వ్యవహరించాడు. రాజకీయంగా, సైద్ధాంతికంగా డివిఎస్‌ ను ఎదుర్కొనలేక ఆయన మీద లేనిపోని నిందలు మోపారు మితవాదులు. దృఢచిత్తంతో ఆ నిందలను, కువిమర్శలను తిప్పికొట్టాడు డివిఎస్‌. కమ్యూనిస్టులకు వివాదాలు వచ్చినప్పుడు కీలకంగా స్వీకరించాల్సిన అంశం రాజకీయ అంశమని డివియస్‌ తన జీవితంలో (ఆచరణలో) తేల్చి చెప్పాడు. అన్ని కష్టాలను ఎదురొడ్డి తను నమ్మిన రాజకీయ విధానం కోసం కృతనిశ్చయంతో పోరాడాడు. ఈ విధానమే స్వాతంత్య్రానంతరం పార్టీ బలోపేతం అవడానికి తోడ్పడింది. పార్లమెంటులోనూ, పార్లమెంటరీ యేతర రంగంలోనూ పోరాడి నిలిచింది.
 

                                                          క్యాన్సరు కబళించింది

1949, పళనియప్పన్‌ పోలీసులు పెట్టిన చిత్రహింసలు ఆయన సంకల్పాన్ని లొంగదీయలేదు. కడలూరు జైలులో నిర్బంధాలు కూడా లొంగదీయలేదు. 1964 అరెస్టులు, డిటెన్షన్‌ కూడా లొంగదీసుకోలేక పోయింది. కానీ క్యాన్సర్‌ వ్యాధి 8 మాసాలు పాటు మంచం పట్టించింది. 1966 జనవరి 8వ తేదీన ప్రాణం తీసింది. 1927 జనవరి 1వ తేదీన జన్మించిన డివిఎస్‌ తల్లిదండ్రులకు 8వ సంతానం.
ఈనాడు పార్టీ ముందు సవాలక్ష సమస్యలున్నాయి. జాతీయోద్యమంలో పార్టీ పెరిగింది. స్వాతంత్య్రానంతరమూ పార్టీ బలపడింది. కానీ సరళీకరణ విధానాల అనంతరం కొంత బలహీనపడ్డాం. 21వ మహాసభలో మన విధానాల్ని సమీక్షించుకొని కర్తవ్యాలు రపొందించుకొన్నాం. వామపక్ష ప్రత్యామ్నాయమే పార్టీ సొంత బలం పెరగడానికి మార్గం అనుకున్నాం. దాని అమలులోనూ కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆ అవాంతరాలను, బలహీనతలను అధిగమించి వర్గ, ప్రజా పోరాటాలను ముమ్మరం చేసి ఆ ప్రజా బలంతో మళ్లీ ముందుకు సాగడానికి అవసరమైన కార్యాచరణను కన్ననూర్‌లో జరగబోయే 23వ మహాసభలో రూపొందించుకోబోతున్నాం.
 

                                                                కర్తవ్యం

మన దేశంలో కొన్ని దశాబ్దాల పాటు అభివృద్ధి చెందుతూ వచ్చిన పెట్టుబడిదారీ వర్గం సరళీకరణ విధానాలతో పెట్టుబడి కేంద్రీకరణ ద్వారా తన పట్టును మరింత బలపరుచుకున్నది. అలాగే వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వడివడిగా పెరిగింది. భూస్వాములు, ధనిక రైతులు, కాంట్రాక్టర్లు వ్యాపార వర్గాలతో కలిసి గ్రామాల్లో కూటమి ఏర్పడింది. ఈ బూర్జువా భూస్వామ్య పాలక వర్గాలు విదేశీ ద్రవ్య పెట్టుబడికి సహకరిస్తున్నాయి. సరళీకరణ, ప్రయివేటీకరణ, నగదీకరణ రూపంలో వచ్చిన ఆర్థిక విధానాలతో కార్మికులు, రైతాంగంపై దోపిడి పెరిగింది. అదానీ, అంబానీల లాభాలు ఎక్కువయ్యాయి. గ్రామాల్లో కూటమిగా ఏర్పడిన పరిణామం మన ప్రజా పునాదిని దెబ్బతీసింది. అందువల్ల మన పార్టీ ప్రధానంగా ప్రజా సమస్యలపై కేంద్రీకరించాలి. స్థానిక సమస్యలపై కేంద్రీకరించాలి. మారిన వర్గ సంబంధాల్లో, దోపిడీకి గురవుతున్న వర్గాల్ని సమీకరించడంపై దృష్టి పెట్టాలి. ఉద్యమాలు పోరాటాల్ని ఉదృతం చేయాలి. పార్టీలో వర్గ ఉద్యమాలు, పోరాటాలు తగ్గినప్పుడు, చిల్లర సమస్యలే ముందుకొస్తాయన్న దాన్ని గమనంలో పెట్టుకొని ప్రజా ఉద్యమాలకు అంకితంగావడమే మన ముందున్న కర్తవ్యం. పరీక్షా సమయాల్లో డివియస్‌ ప్రదర్శించిన రాజకీయ దృఢత్వం, త్యాగ స్ఫూర్తి నేటి కమ్యూనిస్టులకు అనుసరణీయమైన ఆదర్శం.
    నేను చదువుకొంటూ అప్పుడప్పుడే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే రోజుల్లో డివియస్‌ మరణ వార్త నెల్లూరు పార్టీలో సృష్టించిన స్పందన లోతు నాకు సరిగ్గా అర్థంగాలేదు. ఒక పెద్ద నాయకుడు మరణించాడన్న అంశం తప్ప మరొకటి తెలియదు. విజయవాడ కేంద్రానికి వచ్చాక జనవరి 8న డివియస్‌గారి ఇంట్లో సంస్మరణ కోసం హాజరయ్యాను. యం.హెచ్‌ గారు, మానికొండ సుబ్బారావు గారు తదితరులు వచ్చారు. డివియస్‌ కుటుంబం యెడల ఎంత గొప్ప గౌరవం వ్యక్తమైందో స్వయంగా చూశాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గురించి పార్టీలో మాట్లాడుకోవడం, ఆయన గురించి తెలుసుకోడానికి నాకు అవకాశం కల్గింది. సుందరయ్య గారు నన్ను పిలిచి డివియస్‌ కుమార్తె శారదను విశాఖ యూనివర్శిటీలో చేర్పించి రమ్మన్నారు. ఆ పని చేశాను. ప్రతి సంవత్సరం జనవరి 8 గుర్తుండిపోతుంది. పార్టీకి, ప్రజాశక్తి యావత్‌ సిబ్బందికి డివిఎస్‌ అంకితభావం ఎప్పటికీ గొప్ప సందేశం ఇస్తూనే వుంటుంది.
 

/ వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు /

పెనుమల్లి మధు