
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : స్వాతంత్య్ర ఉద్యమం, మహనీయుల పోరాటాలను నేటి తరానికి తెలియజెప్పేందుకు అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వద్ద ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలక్టరేట్ నుండి 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ అగ్రభాగాన జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ హెనీ కత్తెర క్రిస్టినా, శాసన మండలి సభ్యులు కే. ఎస్. లక్ష్మణ రావు, లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఎమ్మెల్యేలు డా. ఉండవల్లి శ్రీదేవి, షేక్ మహమ్మద్ ముస్తఫా, కమిషనర్ కీర్తి చేకూరి, రాష్ట్ర మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి నడిచారు. ఈ భారీ ర్యాలీ కలక్టరేట్ నుండి ప్రారంభమై కంకరగుంట ఫ్లై ఓవర్, స్వామి వివేకానంద విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. ర్యాలీ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ర్యాలీలో ఆరు వేల మంది వరకు హాజరు అయ్యారనితెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలవిద్యార్ధులు, ఎన్.సి.సి విద్యార్ధులు, డ్వాక్రా సభ్యులు, స్వచ్చంద సంస్థలతో 750 మీటర్ల జాతీయ జెండా తో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 75 సంవత్సరాల క్రితం ఏ రకమైన పరిస్థితులు దేశ వ్యాప్తంగా ఉన్నాయో అనాటి అణచివేతలు, అవమానాలు వాటి నుండి ఎంతో మంది త్యాగ మూర్తుల ప్రతిఫలంగా ఏర్పడిన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా అనేక విధాలుగా మనం వారి స్పూర్తిని కలిగించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకు తెలియనటువంటి త్యాగధనులను గుర్తించే కార్యక్రమాలను, చారిత్రక కట్టడాలు సందర్సించుట, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సందర్శించేందుకు ఏర్పాట్లుచేశామన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీలలో ప్రత్యేకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసే విధంగా ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ హెనీ కత్తెర క్రిస్టినా 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. శాసన మండలి సభ్యులు కే. ఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ యువతలో ముఖ్యంగా విద్యార్థులు యువజనులో దేశభక్తి కొరవడిందని ఒక అధ్యాపకునిగా భావిస్తున్నానన్నారు. దీనిని పెంపొందించడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని భావిస్తున్నానన్నారు. సుమారు ఆరు వేల మందితో ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్,వారి యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.ఈ సందర్భంగా ట్రిపులేక్స్ సోప్ కంపెనీ అధినేత అరుణాచలం మాణిక్య వేల్ ను దుశ్శాలువాతో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సన్మానించారు. జాయింట్ కలెక్టర్ జి. రాజ కుమారి, డిఆర్వొ చంద్ర శేఖర రావు, ఆర్డీఓ ప్రభాకర రెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాస రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి, డీఈఓ శైలజ,తహశీల్దార్ సాంబశివరావు, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శ్రీనివాస్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు,మిర్చి యార్డ్ చైర్మన్ చంద్ర గిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.