Aug 10,2022 00:09

ప్రజాశక్తి - విశాఖపట్నం
1920లో దేశంలో స్వాతంత్య్ర కాంక్ష బలీయమైంది. విశాఖ జిల్లా నుంచి ఎందరో యువకులు, మహిళలు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. అదే సమయంలో గాంధీ విశాఖ జిల్లాలో పర్యటించారు. గాంధీ ప్రసంగాలకు యువత స్ఫూర్తి పొంది పెద్దఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1921 మార్చి 31న విజయవాడలో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకుగానూ గాంధీ కోల్‌కత్తా నుంచి మార్చి 27న మెయిల్‌లో బయల్దేరారు. మార్గమధ్యలో అనకాపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆగి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గాంధీజీ తిరిగి 1929 ఏప్రిల్‌ 28న విశాఖపట్నం మరోసారి వచ్చారు. భీమునిపట్నం, అనకాపల్లి, ఏటికొప్పాక, చోడవరం, కైలాసపట్నం, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఖద్దరు నిధి వసూలు చేశారు. 1933లో మరోసారి గాంధీ విశాఖపట్నం వచ్చారు. అస్పృశ్యతా నివారణోద్యమంలో భాగంగా ఆయన ఈ దఫా పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో హరిజన ఫండ్‌ సమకూరింది. 1946లో గాంధీ మరోసారి విశాఖ జిల్లాలో పర్యటించారు. కళావెంకటరావు, తెన్నేటి విశ్వనాథం, ముళ్లపూడి పళ్లంరాజు, కొల్లూరి వీరభద్రరావు తదితరులతో కలిసి గాంధీ రైల్వే మైదానంలోని బహిరంగ సభకు కాలినడకన వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ విశాఖ జిల్లాను నాలుగుసార్లు సందర్శించారు. ఇలా పర్యటించినప్పుడల్లా గాంధీకి విశాఖ ప్రజలు అండగా ఉన్నారు. గాంధీ స్ఫూర్తితో అనకాపల్లి, మాడుగుల, యలమంచిలి వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున పోరాటాలు చేశారు.