
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సరైన ప్రణాళికతో ప్రయత్నం చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్‌ఐ కొలువులకు శిక్షణ పొందుతున్న జిల్లా పోలీసు శాఖకు చెందిన అభ్యర్థులకు ఉచితంగా పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భావపురి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ వారు సోషల్ సర్వీస్ చేస్తున్నారని, నిరుద్యోగులకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారని, పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఎస్‌ఐ కొలువులను సాధించడానికి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని కోరగా అందుకు వారు అంగీకరించి పోలీస్ శాఖకు చెందిన 26 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఏదీ సులువుగా రాదని, మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ప్రత్యేక శిక్షణ, ప్రణాళిక అవసరమని అన్నారు. సరైన ప్రణాళికతో ప్రయత్నం చేస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ కొలువులకు పోటీ ఎక్కువగా ఉన్నదని, ఆ పోటీలో విజయం సాధించాలంటే సరైన శిక్షణ ఉండాలన్నారు. జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శిక్షణ తరగతులకు వెళ్లి రావడానికి శాఖా పరంగా కొంత వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. దానిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని ఎస్‌ఐ ఉద్యోగాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆవుల వెంకటేశ్వర్లు, డి చిన్న భూషణం, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.