Jun 23,2021 18:19

న్యూఢిల్లీ : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌ పవార్‌ మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారం ఇరువురు సమావేశమైనట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌ల నేతలు మంగళవారం ఢిల్లీలోని శరద్‌ పవార్‌ నివాసంలో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే థర్డ్‌ ఫ్రంట్‌ గురించి ప్రస్తావన రాలేదంటూ పలువురు నేతలు పేర్కొన్నారు. అయితే ఆ మరుసటి రోజే పవార్‌ను ప్రశాంత్‌ కిశోర్‌ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 15 రోజుల్లో శరద్‌ పవార్‌ ప్రశాంత్‌ కిషోర్‌తో సమావేశమవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌ 11న ప్రశాంత్‌కిషోర్‌ స్వయంగా ముంబయిలోని పవార్‌ నివాసానికి వచ్చి మరీ కలిశారు. అనంతరం ఢిల్లీలో 21వ తేదీన మరోసారి ఇరువురు భేటీ అయ్యారు. శరద్‌ పవార్‌ నేతృత్వంలో  థర్డ్‌ ఫ్రంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. పవార్‌, ప్రశాంత్‌ కిషోర్‌ల భేటీలు ఆవార్తలకు మరింత బలాన్నిస్తున్నాయి. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్‌ పవార్‌ను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లూ వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా, 2017 జులై 25న దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధ్యతలు చేపట్టారు.