
కొలంబో : పాలక పార్టీ ఎంపి అజిత్ రాజపక్సాను శ్రీలంక డిప్యూటీ స్పీకర్‌గా పార్లమెంట్ మంగళవారం ఎన్నుకుంది. కాగా, ఆయన ఎన్నికపై పార్లమెంట్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్లో నిర్వహించిన రహస్య బ్యాలెట్ ద్వారా ఆయనను ఎన్నుకున్నారు. కొత్త ప్రధాని రణీల్ విక్రమసింఘె ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా పార్లమెంట్ సమావేశమైంది. పాలక శ్రీలంక పొదుజన పెరమునా పార్టీకి చెందిన అజిత్ రాజపక్సాకు 100 ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్షం ఎస్జెబి అభ్యర్ధి రోహిణి కవిరత్నకి 78ఓట్లు లభించాయి. మరో 23ఓట్లు తిరస్కరణకు గురైనట్లు స్పీకర్ మహిందా యపా అబెవర్దన్ తెలిపారు. కాగా, ఓటింగ్‌కు వ్యతిరేకంగా పలువురు ఎంపీలు మాట్లాడారు. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ఏకాభిప్రాయానికి వచ్చి ఏదో ఒక పేరును ప్రతిపాదించాల్సిందిగా శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి)తో సహా ఇండిపెండెంట్ గ్రూపు, పాలక పార్టీ సభ్యులు కొందరు ఎస్జెబి, ప్రభుత్వాన్ని కోరారు. అయితే రెండు పక్షాలు ఏకాభిప్రాయ సాధనలో విఫలమయ్యాయి. ప్రతిపక్షం, ప్రభుత్వం, స్పీకర్ మధ్య వాడిగా, వేడిగా మాటల యుద్ధం సాగింది. ఏకాభిప్రాయం లేని పక్షంలో ఓటింగ్ నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని స్పీకర్ సభకు తెలియచేశారు. మహిందా రాజపక్సా, ఆయన కుమారుడు నమల్ ఇరువురూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. బసిల్ రాజపక్సా, శశీందర్ రాజపక్సా ఇతర కుటుంబ సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు.