May 15,2022 08:09

కొలంబో : శ్రీలంక నూతన ప్రధాని నియామకాన్ని తిరస్కరించిన ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గొటబయ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. దేశం వినాశకర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి అధ్యక్షుడు బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది. అంతవరకు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కొనసాగిస్తామని ప్రధాన ప్రతిపక్షం స్పష్టం చేసింది. నిరసనకారులపైకి రౌడీలను ప్రయోగించి ప్రజాగ్రహానికి గురైన మహింద రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అయిదుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్‌ విక్రమ సింఘె గురువారం బాధ్యతలు స్వీకరించారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి ఇది ఏ విధంగానూ తోడ్పడదని ప్రతిపక్షం పేర్కొంది. కొత్త ప్రధానిని అధ్యక్షుడు రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తారని ప్రతిపక్ష ఎంపి ఎరాన్‌ విక్రమ రత్నె వ్యాఖ్యానించారు.
    అధ్యక్షుడు గొటబయ గద్దె దిగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయకు చెందిన ఈ సీనియర్‌ నేత డిమాండ్‌ చేశారు. మా ప్రజలకు న్యాయం చేకూర్చేదాకా ఈ పోరాటాన్ని ఆపేది లేదని చమలాగే శివకుమార్‌ అన్నారు. ఎవరిని ప్రధానిగా నియమించినా ప్రజలకు ఊరట లభించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విక్రమ సింఘె (73) తన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క సభ్యుడు కావడంతో ఆయన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యర్థి పార్టీలపై ఆధారపడాల్సిన స్థితి వచ్చింది. 225 స్థానాలున్న పార్లమెంటులో రాజపక్సల నేతృత్వంలోని కూటమికి 100 స్థానాలు, ప్రతిపక్ష పార్టీకి 58 స్థానాలు ఉన్నాయి. మిగతావి ఇండిపెండెంట్లకు చెందినవి. కొత్త ప్రధాని విక్రమ సింఘె శుక్రవారం నాడు భారత్‌, జపాన్‌, చైనా, అమెరికాకు చెందిన విదేశీ రాయబారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుని, సుస్థిరత సాధించేందుకు విదేశాల సహకారాన్ని ఆయన అభ్యర్థిఇంచారు.
 

                                                 శ్రీలంకలో 12 గంటల పాటు కర్ఫ్యూ ఎత్తివేత

మహిందా రాజపక్సా ప్రధానిగా రాజీనామా చేసిన అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను శనివారం 12 గంటల పాటు ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రధాని రణిల్‌ విక్రమసింఘె ముందుగా నలుగురితో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎల్‌పిపికి చెందిన నలుగురిని మంత్రులుగా నియమించారు. యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ నుండి విక్రమసింఘె ఒక్కరే ఎంపిగా వున్నందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇరత పార్టీలపై ఆధారపడాల్సిందే. ఎస్‌ఎల్‌పిపి ఆయనకు మద్దతిస్తానని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చైర్మన్‌ జిఎల్‌ పెరిస్‌తో సహా నలుగురిని మంత్రిమండలిలోకి తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆయనకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పగా, పలు చిన్న పార్టీలు మాత్రం కొత్త ప్రధాని చేపట్టే విధానాలకు మద్దతిస్తామని హామీ ఇచ్చాయి. నెల రోజులకు పైగా దేశంలో శాంతియుతంగా సాగిన నిరసనలు, ఆందోళనలు ఈ వారంలో ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆ అల్లర్లలో 9 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే సోమవారం 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. నిత్యావసరాల కొనుగోలు కోసం గురు, శుక్రవారాల్లో కొద్ది గంటల పాటు సడలించారు. శనివారం ఏకంగా 12 గంటల పాటు ఎత్తివేశారు.