Mar 19,2023 22:04

భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు , మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
- భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు
ప్రజాశక్తి - శ్రీశైలం

       శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఆదివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభ మయ్యాయి. మహోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు సంప్రదాయబద్ధంగా దేవస్థానం కార్య నిర్వహణాధికారి లవన్న దంపతులు, వేద పండితులు, అర్చకులు యాగశాల ప్రవేశం, వేద స్వస్తి శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, వాస్తు పూజ, మండ పారాధనలు, చండీశ్వరపూజ, అఖండ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా రుద్రహౌమం, రుద్రపారాయణ, అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవవరార్చనలు, చండీహౌమం, సాయంత్రం 5:30 గంటల నుండి అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ, కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు జరిగాయి.
భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం నుండి రాత్రి వరకు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో స్వామి అమ్మ వార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అలంకారంలో అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భృంగి వాహనంపై ఉన్న స్వామి అమ్మవార్లను, మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని వివిధ రకాల కోలాటం, చెక్కభజన, నృత్య ప్రదర్శన, వేదమంత్రాల మధ్య గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో ముందుగా ఆలయ రాజగోపురం గుండా ప్రధాన వీధుల్లోకి ప్రవేశింపజేసి గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగాధర మండపం వద్ద నుండి నంది గుడి వరకు, అక్కడ నుండి బయలు వీరభద్ర స్వామి వరకు, అక్కడి నుండి ఆలయంలోకి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.