Jul 29,2021 20:11

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : సర్క్యులర్‌ 172 వల్ల ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతుందని, ప్రజా పోరాటాలతోనే దాన్ని తిప్పికొడదామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక జెడ్‌పి మినిస్టీరియల్‌ భవనంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జె.రమేష్‌చంద్ర పట్నాయక్‌ అధ్యక్షతన 'విద్యారంగ సంస్కరణలు, మెమో 172 అమలు-పర్యావసానాలు'పై జరిగిన సదస్సులో వెంకటేశ్వర్లు ప్రసంగించారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 172 సర్క్యులర్‌ను తీసుకొచ్చిందన్నారు. 172ను యధాతథంగా అమలు చేస్తే 250 మీటర్లు దగ్గరగా ఉన్న ప్రాథమిక స్కూళ్లు మూతపడతాయని తెలిపారు. విద్య కోసం పెడుతున్న ఖర్చును తగ్గించుకోవాలని ఈ జీవో చెబుతోందన్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను ముక్కలు చేస్తుందన్నారు. పీరియడ్‌ అనే పద్ధతి పెట్టి చిన్న పిల్లలకు అమలు చేస్తే డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతాయన్నారు. యుపి పాఠశాలల్లో ప్రైమరీ పాఠశాలలను కలపడం వల్ల ఒకే స్థాయి విద్యార్థులకు ఒకే రకమైన విద్య అందకుండా పోతుందన్నారు. కావాలనే అంతరాలను పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. చిన్నపిల్లలు 2, 3 కిలోమీటర్లు నడిచి వెళ్లలేక బడి మానేసి అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 34 వేల పాఠశాలలను ప్రీ ఎలిమెంటరీ పాఠశాలలుగా మార్చేసి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని ఇస్తుందన్నారు. హైస్కూళ్లలో 9వేల మంది అదనంగా తేలనున్నారని వివరించారు. మిగిలిపోయిన ఉపాధ్యాయులను భవిష్యత్‌లో ఎంఆర్‌పిలుగా మార్చబోతున్నారని అన్నారు. దీనివల్ల ఎస్‌జిటి పోస్టులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్నారు. భవిష్యత్‌లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ఉండదన్నారు. ఇంటర్‌, హైస్కూల్‌ విద్యను కలపడం వలన అధ్యాపకులు మధ్య వేతనాల్లోను, చదువు చెప్పే విషయంలోను అంతరాలు ఏర్పడతాయన్నారు. ఈనేపథ్యంలో విద్యారంగాన్ని కాపాడుకునేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రజా పోరాటం నడపాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, జిల్లా గౌరవాధ్యక్షులు సత్యశ్రీనివాస్‌, కార్యదర్శి ఈశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.