Jan 14,2022 19:41

ఉగాది అంటే ఓ పచ్చని తోరణం. ఆరు రుచుల పచ్చడి ఆస్వాదనం. దీపావళి అంటే చీకటి వేళ వెలుగుల వేకువ. ఓ సాయంత్రపు తరుణాన శబ్దాల సందడి. దసరా అంటే కమిటీలకు, వీధులకు పరిమితమైన సరదాల వెల్లువ. మరి సంక్రాంతి అంటే ...? ఈ పండగలన్నీ కలిపితే ఎంతో- అంతకు మించిన సంబరం. ఊళ్లకు ఊళ్లు సంతోషాల సంద్రాలై ఉవ్వెత్తున ఉప్పొంగినంత ఉత్సవం. ప్రతి ఇల్లూ ముచ్చట్లూ మురిపాలతో మునిగి తేలినంత ఆనందం!

ఇన్నిన్ని సందళ్లూ, సరదాలూ కలగలిసి ఉన్న సందర్భం కనుకనే సంక్రాంతి అంటే పెద్ద పండగ. పేరుకు మూడురోజుల పండగే అయినా- నిజానికి అది నెల రోజుల ఆనందాల వెల్లువ. పండగ రోజే పండగ కాదు; ఆ పండగను తలచి మురిసిన ప్రతి సందర్భమూ పర్వదినమే! పండగ కోసం చేసే ప్రతి సన్నద్ధతా ఉత్సవ తరుణమే! ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో అని తలచుకునే ఊళ్లోని అమ్మలకు; ఊరెళ్లటానికి ఏమేమి సమకూర్చుకోవాలో, సెలవులు ఎలా సర్దుబాటు చేసుకోవాలో అని సన్నద్ధమయ్యే బిడ్డలకూ పండక్కి చాలా రోజుల ముందు నుంచే హృదయ ఉత్సవం మొదలవుతుంది. సంక్రాంతికి ముందూ వెనుకా పట్టణాల నుంచి పల్లెలకు; పల్లెల నుంచి పట్టణాలకు ప్రయాణం చేయటం బయటికి కనిపిస్తుంది. కానీ, అంతకుముందే మనసులు జ్ఞాపకాలను కదుపుకొని, సందళ్లను తలచుకొని వందల వేల సార్లు ఊరూరికీ అనేకసార్లు ప్రయాణం చేస్తాయి. సంక్రాంతి .. మనిషిని మనసా వాచా మూలాలకు ముడివేసే పండగ. ఎదిగిన కొమ్మల మీంచి, ఎక్కిన ఎత్తుల నుంచి వినమ్రంగా దిగొచ్చి నేలను స్పృశింపజేసే పర్వదినం.
పుట్టి పెరిగిన ఊరు అనే ఆత్మీయత ఎప్పటికన్నా ఈ సంక్రాంతి రోజుల్లోనే ఎక్కువగా వెల్లి విరిస్తుంది. ఇది పూర్తిగా వ్యవసాయ సంబంధ పండగ కావడం వల్ల గ్రామాల్లోనే ఆ సందడీ, శోభా అల్లుకొని ఉంటాయి. అందుకనే ఎక్కడ ఉన్నవారైనా సంక్రాంతికి గ్రామాలకు రావడం ఓ ఆనవాయితీగా వర్థిల్లుతోంది. బాల్యమిత్రులు కలుసుకోవడం, ఒకప్పుడు తిరుగాడిన ప్రాంతాలను సందర్శించటం, జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఒక సంతోషకర వ్యాపకంగా సాగుతుంది. కుటుంబంలోని పిల్లాపెద్దలు అందరికీ ఈ పండగ ఎడతెగని వ్యాపకాలకు కల్పిస్తుంది. ముంగిళ్లలో ముగ్గులు, నింగిలో పతంగులు, వంటింట్లో పిండివంటలు, ఆరుబయట ఆటలూ పాటలూ, హరిదాసుల సంకీర్తనలూ, గంగిరెద్దుల నృత్యాలూ, జానపదుల సాంస్కృతిక సందళ్లూ, కొత్త బట్టలు, అలంకరణల మురిపాలు, అంతూపొంతూ లేని ముచ్చట్లు, పొలాల గట్ల మీద పరుగులు, పశువుల కొమ్ములకు అలంకరణలు, కోడిపందేలూ, పశువుల సందోహాలూ, అన్నిచోట్లా గుమిగూడే జన సమూహాలూ ... ఇలా ఇలా ... ఓ పెద్ద సాంస్కృతిక మేళాలా సాగుతోంది సంక్రాంతి. ఎక్కడ చేరాల్సిన వాళ్లు అక్కడ చేరతారు. సంబరాల్లో, సంభాషణల్లో తలమునకలై తేలతారు.
వ్యవసాయ సంస్కృతే మూలం
సంక్రాంతి ఒక శ్రమైక సాంస్క ృతిక వేడుక. ఏదైనా ఒక పండగకు సంబంధించిన పతాక స్థాయి ఉత్సాహాం అది జనంతో, జనం దానితో మమేకం కావడంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల జీవితంతో అది పెనవేసుకుపోవడంపై అనుసంధానమై ఉంటుంది. దాని మూలాలు జానపదాల్లో విస్తరించటం పైనా ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ శ్రమైక సంస్కృతితో ముడిపడిన మూలాలు సంక్రాంతిలో మనకు చాలావి తారసపడతాయి. పంటలు పండడం, రైతులు, వ్యవసాయ శ్రామికులు సంతోషంగా ఉండడం ఈ పండక్కి మూల దినుసు. ఆ చుట్టూ వృత్తిదారులు, వ్యవసాయ ఆధారిత వ్యాపకులు, జానపద సాంస్క ృతిక ప్రచారకులు ఉంటారు. పంట-ఫలసాయం అనే ఉత్పత్తి ఈ అందరి మధ్యా సంబంధ బాంధవ్యాలను బలంగా పట్టి ఉంచుతుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు; ఆనవాయితీలూ ఈ ఉత్పత్తి సంబంధాల చుట్టూనే అల్లుకొని ఉంటాయి. ఆటలుగా, పాటలుగా, మాటలుగా మనసు మనసులో, ప్రతి మనిషిలో సంక్రాంతి ప్రతిబింబించటానికి వ్యవసాయ సంస్కృతే కీలకపాత్ర పోషిస్తోంది. వ్యవసాయ రంగంలో వచ్చిన, వస్తున్న మార్పుల ప్రభావం ఈ సంస్కృతిపైనా, సందడి పైనా ఎక్కువగానే పడుతుంది. వృత్తిదారులు, జానపద కళాకారులు ఇప్పటికే ఈ ఛట్రం నుంచి విడిపోయిన వైనం మనకు కనిపిస్తుంది. వ్యవసాయ రంగం కూడా అటు పాలకుల చేత, ఇటు ప్రకృతి వైపరీత్యాల చేతా ఎడాపెడా దెబ్బలు తింటుంది. ఆ రంగానికి సారథి లాంటి రైతు ఆనందంగా లేకపోతే ఆ ప్రభావం పండగపైనా ఉంటుంది. సంక్రాంతి సంస్కృతి నిలబెట్టుకోవాలంటే రైతును కూడా మనం నిలబెట్టుకోవాలి.
ఊరికి ఉపకారం
సంక్రాంతి సందర్భం ఇప్పుడు చాలామంది బాల్య మిత్రులు, చదువు స్నేహితులు తిరిగి కలుసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. అప్పటి అల్లరి కబుర్లను, తుంటరి సంగతులను తలచుకొని మనసారా నవ్వుకోవటం బిజీబిజీ జీవితాలకు గొప్ప టానిక్కునే ఇస్తుంది. ఊరు మనకు ఇంత గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వటమేనా? మనం తిరిగి ఏమీ ఇవ్వలేమా? అన్న ఆలోచన కూడా చాలామందిలో రేగుతోంది. ఎక్కడెక్కడో ఏవేవో ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారు ఉనికినిచ్చిన ఊరికి, బతుకునిచ్చిన బడికి ఏదొక ఉపకారం చేయాలని తలుస్తున్నారు. ఒక్కరు గానో, తలకొంత వేసుకొని ఉమ్మడిగానో ఊరికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. అలాంటి సహకార ఆలోచనలు కలగటానికి సంక్రాంతి సమ్మేళనాలు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి.
నెలరోజులుగా తలచి, మురిసిన సంక్రాంతి సందడి చూస్తుండగానే కళ్ల ముందు నుంచి కదలిపోతుంది. కనుమ రోజు నుంచి తీర్థాలు, తిరునాళ్లూ మొదలవుతాయి. దానికన్నా ముందే తిరుగు ప్రయాణాలు మొదలవుతాయి. మళ్లీ మళ్లీ నెమరువేసుకోవటానికి కొన్ని జ్ఞాపకాలు జమ అయి ఉంటాయి. చాలా రోజుల తరువాత కలిసిన స్నేహితులు, ఈసారే కలిసిన కొత్త అల్లుళ్లు, వారి వారి బంధువులూ, పిల్లలకు కొత్త పరిచయాలు, కుటుంబాలతో బంధాలూ ... రేపటిని మరింత సందడిని చేసుకోవటానికి దోహదపడతాయి. సంస్కృతీ సాంప్రదాయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. సంక్రాంతిలో కొన్ని పాత సందళ్లు పోయి ఉండొచ్చు. కొన్ని కొత్తవి చేరి ఉండొచ్చు. కాలానుగుణంగా మారటం అనివార్యం. మారే వాటిని నిరాకరించకుండా ఉండటమే మానవ సంస్కృతి. జనం సమిష్టిగా, సందడిగా కలగలిసి సాగటమే సదా సంక్రాంతి.


- శాంతిమిత్ర