Mar 28,2023 00:25

ఎంపిడిఒకు ఫిర్యాదు చేస్తున్న కొత్తలూరు సర్పంచ్‌ గుంటూరు నాగమల్లీశ్వరి

ప్రజాశక్తి - శావల్యాపురం : రాజకీయాలకు అతీంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించి అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని శావల్యాపురం మండలం కొత్తలూరు సర్పంచ్‌ గుంటూరు నాగమల్లీశ్వరి ఆవేదన వెలిబుచ్చారు. తనతోపాటు ఉపసర్పంచ్‌కూ సమాచారం లేకుండా సోమవారం గ్రామసభను నిర్వహించారని ఎంపిడిఒకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఉపసర్పంచ్‌తో కలిసి విషయాన్ని ఎంపిడిఒకు సర్పంచ్‌ వివరించారు. అయితే పంచాయతీ కార్యదర్శి ద్వారా సమాచారం అందలేదా? అని సర్పంచ్‌ను ఎంపిడిఒ అడుగగా లేదని సర్పంచ్‌ చెప్పారు. దీనిపై తాను జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాద చేస్తానని, న్యాయపోరాటమూ చేస్తానని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వేల్పూరు సర్పంచ్‌గా ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భార్య ఆదిలక్ష్మి సర్పంచ్‌గా పని చేశారని, ఆ సందర్భంలో ఇలా ఏమీ చేయలేదని, ఇప్పుడు ఇంత దారుణమా? అని ప్రశ్నించారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలేగాని ఇలా అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా, వారి కనుసన్నల్లో నడవడం సరికాదని అన్నారు. ఇది తమకు ఘోర అవమానమని, ఎన్నికైన తమను ఇలా అవమానిస్తారా? అని ఆవేదన వెలిబుచ్చారు.