Jun 11,2021 22:10

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్సిటీ : తమను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కూడా స్థానిక కొత్త, పాత ప్రభుత్వాస్పత్రుల వద్ద కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఆందోళన నిర్వహించారు. సుమారు 100 మంది స్టాఫ్‌ నర్స్‌లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 7వ తేదీ నుండి వివిధ రూపాల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 28 నుంచి సమ్మెలోకి వెళతామని హెచ్చరిస్తున్నారు. పని భారం తగ్గించాలని, రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు.
స్టాఫ్‌ నర్సుల ఆందోళనకు సిఐటియు మద్దతు                                                                                                                                                                                  ప్రభుత్వం వెంటనే స్పందించాలి : ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌
స్టాఫ్‌ నర్స్‌లు చేస్తున్న ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు నిచ్చింది. సిఐటియు కృష్ణాజిల్లా పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) విజయవాడ జెఎసి చైర్మన్‌ ఎం.బాబురావు స్టాఫ్‌ నర్సుల ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ వీరి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నా వారిని రెగ్యులర్‌ చేయకపోవడం శోచనీయమన్నారు. కోవిడ్‌ సెంటర్లలో తాత్కాలిక స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న వారికి నెలకు రూ.34 వేలు వేతనం ఇస్తూ, దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వీరికి మాత్రం కేవలం రూ.22,500 మాత్రమే వేతనం ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను సైతం ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో అత్యవసరంగా స్టాఫ్‌ నర్సుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.