Oct 14,2021 00:59

మాట్లాడుతున్న వైటి.దాస్‌

ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 244వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ -1 విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు వైటి దాస్‌, కె.సత్యనారాయణ రావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్త రౌండ్‌ టేబుల్‌ సమావేశాల ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన పరిశ్రమలు ప్రయివేటు సంస్థల ఆధీనంలోకి మారితే ప్రజల జీవన ప్రమాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలే లేకుండా పోతే భవిష్యత్తులో కేంద్రానికి ఆదాయ మార్గాలను మూసుకుపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విడివి పూర్ణచందర్రావు, ఎమ్‌వి.రమణ, జివి.సుబ్బయ్య, పివి రమణమూర్తి, సురేష్‌, నాగబాబు, వెంకటేష్‌, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.