Nov 30,2022 23:51

దీక్షలో కూర్చున్న ఐద్వా నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం సాగిన పోరాటం చారిత్రాత్మకమైనది, ఈ వాస్తవాన్ని విస్మరించి దానిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి హెచ్చరించారు. స్టీల్‌ ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 608వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఐద్వా నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాంటును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 32మంది బలిదానం చేశారని, వేలాది ఎకరాల భూమిని నిర్వాసితులు త్యాగం చేశారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తూ లాభాల్లో నడుస్తుందన్నారు. అటు వంటి సంస్థను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు యత్నిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ది స్టీల్‌ప్లాంట్‌పై ఆధారపడి ఉందని, అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ దీక్షలో ఆర్‌.వరలక్ష్మి, కె.మణి, కె.కుమారి, బి.భారతి, డి.కొండమ్మ, ఆర్‌.విమల పాల్గొన్నారు.