
ప్రజాశక్తి - ఉక్కునగరం : కార్మికుల మనోభావాలతో చెలగాటమాడుతున్న స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పక తప్పదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ హెచ్చరించింది. కూర్మన్నపాలెం కూడలిలో స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షలు శనివారానికి 540వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఎల్‌ఎంఎంఎం, ఎస్బిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. శిబిరాన్ని ఉద్దేశించి డి.సత్యనారాయణ, బి.మురళిరాజు, వరసాల శ్రీనివాస్ మాట్లాడారు.
కలెక్టరేట్ : స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను పోరాటాలతో అడ్డుకొని తీరుతామని సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి ఒ.అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 492వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఐటియు కంచరపాలెం జోన్ నాయకులు, మాధవధార అభివృద్ధి సంఘం నాయకులు, వైసిపి కార్యకర్తలు కూర్చున్నారు. సిఐటియు కంచరపాలెం జోన్ నాయకులు బి.సింహాచలం, ఎస్.రామగోపాల్, పి.మూర్తి, ఎస్.శ్రావణ్, శ్రీదేవి, పాండు, మాధవధార అభివృద్ధి సంఘం నాయకులు పి.పాండురంగారావు, ఎన్వి.రమణమూర్తి, ఎ.ఈశ్వరరావు, వైసిపి నాయకులు గెద్దాడ అప్పలరాజు, వాసాల అప్పలరెడ్డి పాల్గొన్నారు.