Jun 11,2021 22:09

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ)
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా దానిని రక్షించుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్మన్నపాలెం కూడలిలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 120వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అటు వేతన ఒప్పందం జరగక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, మరో పక్క ప్రైవేటీకరణ అంశం కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే కార్మికులంతా ఐక్యమత్యంతో కార్మిక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విశాఖ ఉక్కు రక్షించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవి.సత్యనారాయణ, ఎన్‌ఎస్‌వి.ఉమామహేశ్వరరావు, పి.రామారావు, కార్మికులు పాల్గన్నారు.