Apr 20,2021 22:31
దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్‌ ప్రియాంక

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థులు, యువత ఉద్యమించాలని ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక పిలుపునిచ్చారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 19వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని డాక్టర్‌ ప్రియాంక ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులు, యువత తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని, ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం యువత కదిలి రావాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వాలు పెట్టిన భిక్ష కాదని, ప్రజల ఆస్తులతో నిర్మించారని, ఇది ప్రజల సొత్తు అని తెలిపారు. దీనిని కాపాడుకునే హక్కు మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. మోడీ ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎల్‌.చిన్నారి, పిడిఎఫ్‌ఒ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌, జెఎసి చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ పడాల రమణ తదితరులు పాల్గన్నారు.