Jul 30,2021 00:52

దీక్షల్లో పాల్గొన్న సిఐటియు, జెఎసి నాయకులు

కలెక్టరేట్‌ : రాష్ట్రంలోనే అతి పెద్ద కర్మాగారమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటియు మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అన్నారు. లక్షలాదిమంది అసంఘటిత రంగ కార్మికులు విశాఖ నగరంలో ఉన్నారని, ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థలే కారణమని పేరొన్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 119వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ప్రారంభించిన కృష్ణారావు మాట్లాడుతూ సుమారు 32 వేల మందికి ప్రత్యక్షంగానూ, లక్షమందికి పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు స్టీల్‌ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌పై వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ, సిఐటియు నాయకులు అనపర్తి అప్పారావు, కోటి, పి.వెంకటరావు, విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి డి.అప్పలరాజు, ఎఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు గణేష్‌ పండా, సిఎఫ్‌సిఐటియు నాయకుడు వి.కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు.