Jan 17,2022 07:06

                    స్త్రీలకు శరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి
                    స్త్రీలకు హదయం ఉంది దానికి అనుభవం కావాలి
                    స్త్రీలకు మెదడు ఉంది దానిని ఆలోచించనివ్వాలి

     అరణ్య కృష్ణ గారి మొదటి కవితా సంపుటి 'నెత్తురోడుతున్న పద చిత్రం', రెండోది 'కవిత్వంలో ఉన్నంతసేపూ.' ఈ రెండు సంపుటుల మధ్య ఇరవై ఏళ్ల పై చిలుకు గ్యాప్‌ ఉన్నప్పటికీ కవిత్వానికి సంబంధించిన ఏకసూత్రత కనిపిస్తుంది. కవికి సామాజిక జీవితం ఎంత ముఖ్యమో ఈ కవిత్వం నిరూపిస్తుంది. ఈ రెండు సంపుటుల తరువాత ఆయన రాసిన కవితల్లోంచి - స్త్రీ కేంద్రకంగా రాసిన 27 కవితల్ని ఇప్పుడు 'మనిద్దరం' పేరుతో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం వారు ప్రచురించారు. ఈ సంపుటిలో మొత్తం 27 కవితలు ఉన్నాయని చెప్పడం కన్నా స్త్రీలు అనుభవించే 27 వివక్షల రూపాన్ని వివరించే 27 కవితలు ఉన్నాయని చెబితే సబబుగా ఉంటుంది. 'అసలు మీరు స్త్రీల పక్షాన నిలబడి ఒక మానవీయ కోణాన్ని ఎందుకు ఆవిష్కరించారు? మీకు ఆ అవసరమేముంది.. పుస్తకానికి మనిద్దరమనే పేరెందుకు పెట్టార'ని అడిగినప్పుడు- స్త్రీ భాగస్వామ్యం లేకుండా పురుషుడికి జీవితం ఏది? పురుషాధిపత్య ధోరణితో ప్రధానంగా స్త్రీ హింసకు గురయితే, పురుషుడు స్త్రీ ప్రేమకి దూరం అవుతాడు. స్త్రీ పక్షాన నిలవడం కంటే పురుషుడిని సరిగ్గా ఆలోచింప చేయడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు ఈ కవి.
    'ఇంటి నుంచి అన్నల ఆంక్షల్ని నాన్న అనుమానాల్ని/ అమ్మ చెప్పే జాగ్రత్తల్ని మోసుకుంటూ వీధిలోకెళ్తే/ ఎన్ని ఎదుర్కోళ్ళనీ! ఆడపిల్ల పిండ దశగా ఉన్నప్పటి నుంచి ఎదిగే క్రమంలో ఏ బొమ్మతో ఆడుకోవాలి, ఎవరితో ఆడుకోవాలి, ఎక్కడ ఆడుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం చదవాలి, ఎలా నడవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, చదువుకోవాలా వద్దా, ఉద్యోగం చెయ్యాలా వద్దా, పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకోవాలి ... ఇవన్నీ పితస్వామ్య సమాజమే నిర్ణయిస్తుంది. అందుకు తగ్గట్టుగా 'ఆమేని కండిషనింగ్‌ చేస్తుంది. అదే సమాజం పురుషుడి విషయానికి వస్తే వాడు మగాడని కాలర్‌ ఎగరేసుకు తిరగమంటుంది. ఈ వివక్షే వాడు ఆడపిల్లని ఎలా చూడాలో నిర్ణయించేస్తుంది. ఈ విషయాన్ని ఎంతో బలమైన వ్యక్తీకరణత 'వేట' కవితను ఆవిష్కరించారు కవి. 'యాభై వేల కట్నం పీడ'ని వదిలించుకోవటానికి / ఐదు వందల రూపాయల కిరాయితో / పిండాల్ని హత్య చేయగలదిక్కడి నాగరీకత/. ఆడపిల్ల పుడితేనే అదో పెద్ద నేరంగా భావించి కడుపులో పిండాన్ని కూడా దారుణంగా చంపేసే కుటుంబాలు ఇప్పటికీ లేకపోలేదు. ఎందుకంటే ఆమెను కనడం దండగ, పెంచడం, చదివించడం కష్టం, పెళ్ళి చెయ్యడం మరీ కష్టం ఇన్ని పితృస్వామ్య కష్టాల నుంచి బైట పడాలంటే ఆమెను పిండంగా ఉన్నప్పుడే హతమార్చడమే చాలా తేలిక. ఆడపిల్ల జీవితమో 500 రూపాయల నోటు. పితస్వామ్య సమాజపు లోగుట్టును వాస్తవీకరించిన కవిత 'ఆమ్నియోసెంటసిస్‌ '
      మన సమాజంలో స్త్రీయే కాదు, పురుషుడు కూడా కండిషనింగ్‌ చేయబడతాడు. అయితే స్త్రీ ప్రతికూలంగా కండిషనింగ్‌ చేయబడితే, పురుషుడు ఆధిపత్యపు, అవకాశవాదపు భావజాలంతో కండిషనింగ్‌ చేయబడతాడు. కానీ దాని వల్ల స్త్రీ పురుష సంబంధాల్లో ఒక కృత్రిమత, ప్రేమ రాహిత్యం చొరబడి ఇద్దరినీ పరాయీకరణకి గురి చేసి జీవితాన్ని నిస్సారం చేస్తుంది. ఇద్దరూ రెండూ ఖగోళాల్లా, రెండు గ్రహాల్లా అందుకోలేనంత, చేరువ కాలేనంత దూరాలకి విసిరివేయబడతారు. ఈ విషాద వాస్తవికతని 'వైరుధ్యాల కత్తెరల మధ్య మనిద్దరం'లో కవి బలంగా చెబుతారు. అరణ్యకృష్ణ కవిత్వానికి ఎంచుకున్న ప్రతి వస్తువు అప్పటి, ఇప్పటి కాలమాన పరిస్థితులకూ సరితూగుతున్నదా అనుకున్నప్పుడు అవుననే చెప్పాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో అభివృద్ధి సాధించినప్పటికీ ఈ పుస్తకంలో రాసిన ప్రతి వివక్షా స్త్రీ పట్ల ఇంకా కొనసాగుతూనే ఉంది.
'నీ సమస్త దేహాన్ని సంప్రదాయం రథం తొక్కుకుంటూ వెళ్ళిపోయింది/ చివరికి నువ్వో పాతిక శవాలుగా లెక్కతేలతావు/ భగవంతుడే స్వయంగా అలా నీకు పుణ్యపు చావు మంజూరు చేసాడని/ కర్మ సిద్ధాంతమే సాక్ష్యం చెబుతుందిగా మరి! 'సంస్క ృతి హత్యలకు సంతాపాలే తప్ప చార్జి షీట్లు, శిక్షలు వుండవు' అనే దారుణ వాస్తవాన్ని 'డెత్‌ వారెంట్‌' కవిత ద్వారా నిరూపిస్తారు ఈ కవి. ధ్వంసం చేయాల్సిందంతా ధ్వంసం చేయకపోతే కొత్త నిర్మాణానికి తావు లేదు... గృహ హింస సమసిపోవాలంటే స్త్రీలు ధ్వంసం చేయాల్సిన పురాతన భావజాలాలెన్నో వున్నాయని 'ధ్వంస చైతన్యం' కవితలో చెబుతారు. రిషితేశ్వరి అనే విద్యార్ధిని రాగింగ్‌ భరించలేక ఆత్మహత్య చేసుకున్నప్పుడు చెలరేగిన ఆందోళనల్ని చల్లార్చే వ్యూహంలో భాగంగా ఆమె తండ్రికి ఖరీదైన నష్ట పరిహారాలు ఇచ్చి నోరు మూయించినప్పుడు విలవిల్లాడిన కవి 'మరణానంతర మరణం' కవిత రాశారు. 'అయ్యో! ఆ పిల్ల మళ్లీ చచ్చిపోయిందం'టూ దు:ఖించిన తీరు మన మనసును కలచివేయడంతో పాటు పాలకుల కుతంత్రాల పట్ల ఏహ్య భావం కలిగిస్తుంది.
      'ఈ దేహానికి ఈ భూమికి వ్యత్యాసమేముంది/ రెండింటి మీదా మిలటరీ బూటు మరకలు/ ఒకే రకంగా దిగబడుతున్నప్పుడు/ రెండూ ఒకే రకంగా విలవిల్లాడుతున్నప్పుడు/ ... తమని అణచివేయడానికి వచ్చిందే కాక అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్న సాయుధ మూకలపై నిరసనగా ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదురుగా దిగంబర ప్రదర్శన చేసిన మణిపూర్‌ స్త్రీల వీరోచిత, సాహస పోరాటాన్ని మహౌద్వేగంతో వర్ణించిన కవిత 'యుద్ధ క్షేత్రంలో నిరాయుధ జెండా'. ఇది రాజ్య హింసని స్త్రీలు ఎంత బలంగా ఎదిరించగలరో బలంగా చెప్పిన కవిత. 'ఊహ' పురుషుడు కూడా స్త్రీ అంత సున్నితంగా ఉంటే ఆమె అతడిని ఎంత సానుకూలంగా ప్రభావితం చేస్తుందో తెలియజేసిన కవిత. చివరిలో 'ఊహలన్నీ నిజం కాకపోవడం కూడా జీవితమే' అన్న ముగింపు చూసినప్పుడు కవి హృదయంలోని దు:ఖం మనల్ని తాకుతుంది.
      ఒక సంస్కారవంతమైన పురుషుడు స్త్రీ ప్రేమని ఎంత సంబరం చేసుకుంటాడో తెలియజేసిన కవిత 'తప్త'. 'నిన్ను స్పర్శించాలనుకున్న ప్రతిసారీ/ ఆత్మాలింగనమేదో అనుభవమౌతుంటుంది/ నీ కాలి కింది మట్టి రేణువులన్నీ ఏరి గుప్పిట చేర్చి ఎదుర్రొమ్ము మీద రాసుకుంటాను/ నీ అడుగులన్నీ ఇంక నా గుండెల మీదనే' అన్న ముగింపు మనల్ని ఆర్ద్రంగా హద్యంగా తాకుతుంది. 'ఆమె గర్భం నిండా రక్త సముద్రాలు/ మనమంతా ఆ రక్త సముద్రంలోంచి/ భూమ్మీదకు కొట్టుకొచ్చిన వాళ్ళమే/ శానిటరీ నాక్పిన్‌ని లగ్జరీ కేటగరీ కిందకి చేర్చి జిఎస్‌టి వేసిన ఘనత మన ప్రభుత్వాలది. స్త్రీ మన:శ్శరీరాల గురించి బొత్తిగా అవగాహన లేని మూఢ, మూర్ఖ, మొరటు, అశాస్త్రీయ సమాజంలో స్త్రీ విలువ గురించి బలంగా చెప్పే కవిత 'రుధిర సత్యం'. 'కట్టుకునే బట్టలంత ముఖ్యమైన తుడుచుకునే గుడ్డముక్కని/ విలాస వస్తువుగా మార్చిన రాజ్య వాణిజ్యాన్ని ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోనివ్వండి/ అంటారు కవి. రాజ్యమూ, మతమూ ఎలాంటి తప్పుడు పద్ధతులు కలిగి వుంటాయో చెప్పే కవిత ఇది. స్త్రీ నెలసరి మైల కాదు, అది సృష్టికి ఆది మూలం అని మొహం పగలగొట్టేలా చెప్పే కవిత ఇది.
      'క్షమించండి శీర్షిక లేదు'లో పెద్దరికం మారణాంగాలతో వెంట పడుతున్నది అంటారు. అక్కడ మారణాంగాలు అనే వాక్యంలో కొత్త డిక్షన్‌ కనిపిస్తుంది. 'మచ్చ' ప్రేమ పేరుతో ఉన్మాద పురుషుల యాసిడ్‌ దాడుల్లో ముఖాల్ని కోల్పోయిన స్త్రీలు అద్దాల్లో తమ ముఖాల్ని తప్పిపోయిన పిల్లల్ని వెతుక్కుంటున్నట్లు చూసుకుని ఎంతగా ఉలిక్కిపడతారో చెప్పిన వేదనాత్మక కవిత. 'తప్పిపోయిన పిల్లల్ని వెతుక్కున్నట్లు/ రోజూ అద్దంలో తమ ముఖాల్ని వెతుక్కునే ఆ స్త్రీలని చూడండి/ వాళ్ల ముఖాల్ని నిప్పుల మీద కండెల్లా కాల్చిన సంస్క ృతి మాత్రం/ శవాలు తగలబడుతున్న కంపు కొడుతున్నది/ 'ఇది ద్రావక భారతం' అని సమాజాన్ని నిరసించిన తీరు గుండెను తాకుతుంది.
      'ఆమె మనకు రోజూ కనబడుతూనే వుంటుంది/ /ఇంట్లోంచి బైలుదేరుతూ/మంచి నీళ్లు తాగితే/ కడుపులో శిలువలు పుట్టుకొచ్చి/ దేహం భారమైపోతుందనే భయంతో నోరెండపెట్టుకునే ఆమె/ మనకి రోజూ కనబడుతూనే వుంటుంది/ అసలు ఆమె మనింట్లోనుంచే బయలుదేరుతుంది/ కానీ మనం ఏమీ ఎరగనట్లే ఉంటాం' (ఆమె శిలువలు మోస్తున్నది). నిజమే కదా, ప్రతి ఆడపిఆ్ల అనుభవించే నిరంతర నరకయాతన ఇది. మగవాడు ఎక్కడ పడితే అక్కడ కానిచ్చే చిటికెన వేలు పని... ఆడపిల్ల మాత్రం చిన్నచాటు కోసం ఎంత వెతుకులాడుతుంది! బైటకు వచ్చినప్పుడు ఆడపిల్ల ఇంత ఇబ్బందిని అనుభవిస్తుందని సమాజానికి తెలిసినా- పట్టని నిర్లక్ష్య ధోరణి.. రోడ్లు విస్తారమైనంతగా మనమనుకునే నాగరీక సమాజమింకా విశాలం కాలేదని చెప్పడానికే దీన్ని మించిన ప్రత్యక్ష్య సాక్ష్యం ఇంకేముంటుంది!
      ఈ పుస్తకంలోని కవిత్వం స్త్రీ కేంద్రకమే కాని స్త్రీలను ఉద్ధరించడానికి రాసినది కాదు. సాటి పురుషులను మేల్కొలపడానికి రాసిన కవిత్వం. ఇది సహానుభూతి కవిత్వం. కవి వాడిన పదజాలం, భాష చాలా ప్రత్యేకంగా ఉంటాయి. శిల్పము, వస్తువు రెండూ విడదీయలేనంతగా కలిసి పోతాయి. ఈ కవిత్వంలో పదబంధాలు, భావచిత్రాలు కవిత్వాన్ని ఉన్నతీకరించి పాఠకులకు ఒక బలమైన సంవేదనను, గాఢమైన అనుభూతిని, లోతైన ఆలోచనని రేకెత్తిస్తాయి. లోతుగా, గాఢంగా రాయాలంటే మార్మికంగా, పాఠకులకు అందనంతగా రాయనవసరం లేదని ఈ కవిత్వం నిరూపించింది. ('మనిద్దరం' స్త్రీ కేంద్రక కవిత్వం. వెల రూ.100. ప్రతులకు : 98499 01078 )
                                                                                     - వైష్ణవి శ్రీ          80742 10263