May 03,2022 06:55

ఆరేళ్ల విరామం అనంతరం నిర్వహించిన ముఖ్యమంత్రులు-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో నెలకొన్న ఘోర వైఫల్యాన్ని అంగీకరించింది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయ లోపాలు, సమస్యలు ఘనీభవిస్తున్నాయని, ఫలితంగా ప్రజలు నష్టపోతున్న వైనాన్ని కళ్లకు కట్టింది. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని కాన్ఫరెన్స్‌్‌ను ప్రారంభిస్తూ ప్రధాని మోడీ సిఎంలకు ఇచ్చిన పిలుపు వెనుక కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కాగా ఉన్నాయి. లేబర్‌ కోడ్స్‌ అందులో భాగమే. వనరుల దోపిడీకి, మార్కెట్‌ హస్తగతానికి ప్రతిబంధకంగా ఉన్న చట్టాల స్థానంలో సరళతర చట్టాలు మోడీ సర్కారు లక్ష్యం. నల్ల వ్యవసాయ చట్టాల ప్రతిపాదన ఆ కోవలోనిదే. తన ఏకరూప సిద్ధాంతం అమలు, సాంస్కృతిక ఆధిపత్యం చెలాయింపునకు హిందీ భాషను బలవంతంగా రుద్దుతూ, కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని మాట్లాడటం రెండు నాల్కల ధోరణి.
            ప్రభుత్వాలే అతి పెద్ద కక్షిదారులంటూ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ చేసిన వక్కాణింపు ముమ్మాటికీ నిజం. కార్యనిర్వాహక వ్యవస్థ తన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వలన జనం కోర్టులకెక్కాల్సి వస్తోందన్న వాస్తవం ప్రభుత్వాల వైఖరిలో మార్పు రానంతకాలం ఎల్లప్పుడూ నిత్య నూతనమే. నిబంధనలకు అనుగుణంగా భూసేకరణ జరిపితే, పోలీస్‌ దర్యాప్తులు నిజాయితీగా సాగితే, సీనియార్టీ, పింఛన్‌లపై రూల్స్‌ పాటిస్తే కోర్టులకు రావాల్సిన అవసరం ఉండదన్నది సిజెఐ విశ్లేషణ. భూసర్వే, రేషన్‌ కార్డులపైనా కోర్టులకెక్కాల్సి వస్తోంది. చట్టాలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని, చట్ట సభల్లో సదరు బిల్లులపై కూలంకషంగా ప్రజల కోణంలో చర్చ జరిగితే కేసులు పడవన్న వివరణ నిజం. ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భంలో, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు బాధితులకు దిక్కు న్యాయస్థానాలే. ప్రభుత్వాలు చట్టబద్ధంగా వ్యవహరించనందునే సమస్యలు. కోర్టు తీర్పులనూ అమలు చేయట్లేదన్న సిజెఐ ఉద్ఘాటన అక్షర సత్యం. మొన్ననే ఢిల్లీ జహంగీర్‌పురిలో ఇళ్ల కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఆపలేదు. సాక్షాత్తూ సిజెఐ ఆగ్రహం వ్యక్తం చేయడం, అదే సమయంలో ఘటనాస్థలిలో సిపిఎం నేత అడ్డు నిలవడంతో మాత్రమే బుల్డోజర్లు ఆగాయి. కోర్టు తీర్పులను విస్మరించే ఘటనలకు దేశంలో కొదవ లేదు.
         న్యాయ వ్యవస్థ అనేకానేక సమస్యలతో సతమవుతోంది. ఐ.టి. వంటి అధునాతన సదుపాయాలు మొదలుకొని సిబ్బంది ఖాళీలు, భవనాల వరకు అన్నీ కొరతే. హైకోర్టుల్లోనే 388 జడ్జిల ఖాళీలున్నాయంటే జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 4.70 కోట్ల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌ పడటం ప్రజలకు అందుతున్న న్యాయం చక్కదనమేంటో తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధికార సంస్థల ఏర్పాటు ప్రతిపాదన సమంజసమైనది. అందుకు ప్రభుత్వాలు ఏ మాత్రం సహకరిస్తాయో చూడాలి. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలి. సుప్రీంలో రాజ్యాంగ కోర్టులో విచారణకు నోచుకోని కేసులు తప్పక ఆందోళన కలిగిస్తాయి. 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కాశ్మీర్‌ను విభజించే అధికారం సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి ఉందా అనే ప్రశ్న ఉదయించింది. ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. పౌరసత్వ హక్కు చట్ట సవరణ, ఎలక్టోరల్‌ బాండ్ల కేసులూ అంతే. పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధిచిన పలు కేసులు సర్వోన్నత న్యాయస్థానంలోనే విచారణకు రాకపోవడం న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పలచన చేస్తోంది. బాబ్రీమసీదు కేసులో ఆధారాలు కాకుండా నమ్మకాలు, విశ్వాసాల ప్రాతిపదికన తీర్పు చెప్పడం యావత్‌ జాతిని విస్మయానికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా 3.5 లక్షల ఖైదీలు విచారణ లేక సంవత్సరాలకు సంవత్సరాలు జైళ్లల్లో మగ్గుతున్నారు. సత్వర న్యాయానికి అర్ధం ఇదేనా? నయా-ఉదారవాద విధానాలొచ్చాక డబ్బున్నోడికే న్యాయం అనే సిద్ధాంతం బలపడింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక అన్ని వ్యవస్థలకు మల్లే న్యాయ వ్యవస్థనూ సంఫ్‌ు పరివార్‌ కబ్జా చేస్తోంది. ఈ పరిస్థితి సర్వసత్తాక గణతంత్ర లౌకిక సమాఖ్య రాజ్యానికి విఘాతం. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన సమయం.