Oct 13,2021 21:03

చెన్నై : తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. ఈ ప్రాంతాల్లో పట్టున్నప్పటికీ ఎఐడిఎంకె ఘోర పరాజయాన్ని చవిచూడటం విశేషం. ఈ కూటమిలోని బిజెపి ఓటమి పాలైంది. అధిక ప్రచారం చేసిన ఎంఎన్‌ఎం, ఎన్‌టికెలు కూడా ఓటమిని చవిచూశాయి. గత ఐదు నెలల్లో తమ ప్రభుత్వ పరిపాలనకు ఫలితంగానే ఈ భారీ విజయం దక్కిందని డిఎంకె పేర్కొంది. తిరునెల్వెలి జిల్లా శివంతిపట్టి గ్రామ సర్పంచ్‌గా 90 ఏళ్ల వృద్ధురాలు ఎంపిక కావడం, టెన్‌కాశి జిల్లాలో ఒక గ్రామంలో సర్పంచ్‌గా 21 ఏళ్ల మహిళ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడం ఈ ఎన్నికల్లో వార్తలుగా మారాయి. 140 జిల్లా కౌన్సిలర్‌ వార్డుల్లో 138 వార్డులను డిఎంకె గెలుచుకుంది. తొమ్మిది జిల్లాల్లోని జిల్లా కౌన్సిల్‌ వార్డుల్లోనూ డిఎంకె కూటమి విజయం సాధించింది. ఈ తొమ్మిది జిల్లాల్లోనూ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సొంతం చేసుకునే స్థితిలో నిలిచింది. 1,381 యూనియన్‌ కౌన్సిల్‌ వార్డుల్లో డిఎంకె 1,010 వార్డుల్లో విజయం సాధించింది.