May 17,2022 19:03

- ఆందోళన చేస్తున్న ప్రజా ప్రతినిధులు, సర్పంచులకు మద్దతు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
స్థానిక సంస్థల హక్కులను కాలరాయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 14, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా స్థానిక సంస్థలకు వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలకు మల్లించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. తక్షణమే నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల అనుమతి లేకుండానే ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా వచ్చిన నిధులను పాతబకాయిలు, విద్యుత్‌ బిల్లులు, రాష్ట్ర అవసరాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుందని పేర్కొన్నారు. ఫలితంగా కనీసం విద్యుత్‌ లైట్లు, బ్లీచింగ్‌ పౌడర్‌ను కూడా చల్లుకోవడానికి నయాపైసా లేకుండా స్థానిక సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ఈ రకంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల అవసరాల నిమిత్తం స్థానిక సర్పంచులు రూ.లక్షలు అప్పులు చేసి తీర్చలేక అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొన్నిచోట్ల ఆందోళనల బాట పట్టారని, కొంతమంది నిరసనగా రాజీనామాలు చేశారని పేర్కొన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెడరల్‌ వ్యవస్థను కాలరాస్తోందని తెలిపారు. స్థానిక సంస్థలకు కవచకుండలులా ఉన్న 73, 74 రాజ్యాంగ హక్కులను హరించివేసిందని పేర్కొన్నారు. దీనికి వైసిపి ప్రభుత్వం కూడా చేతులు కలిపి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఫైనాన్స్‌ ద్వారా తలసరి నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని కోరారు. కేరళ ప్రభుత్వం తరహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో 50 శాతం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులకు, సర్పంచులకు సిపిఎం రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటిస్తోందని పేర్కొన్నారు.