Feb 06,2023 23:00

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు కొత్త కారును కొనుగోలు చేసేందుకు అయ్యే వ్యయం రూ. 42.20 లక్షల మేర స్థాయి సంఘం ఆమోదిస్తూ తీర్మానించింది. విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం విఎంసిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం జరిగింది. 21 అంశాలతో కూడిన అజెండాలోని అత్యధిక అంశాలు ఆమోదం పొందగా, పలు అంశాలు వాయిదాకు దారితీశాయి. కమిషనర్‌ నూతన కారు కొనుగోలు చేసేందుకు అవుతున్న వ్యయం మొత్తాన్ని విఎంసి సాధారణ నిధుల నుంచి మంజూరు చేసేందుకు సమావేశం ఆమోదించింది. సర్కిల్‌-2 ఏరియాలోని శ్రీ కృష్ణదేవరాయ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపుల లీజు కాలం పొడిగించే అంశాన్ని సమావేశం వాయిదా వేసింది. దేశీయ చేపల వినియోగాన్ని మెరుగుపరచడానికి ఆక్వాహబ్‌, రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా వినియోగదారులకు తాజా నాణ్యమైన చేపలను అందుబాటులో ఉంచడానికి నగరపాలక సంస్థకు చెందిన కొత్త రాజరాజేశ్వరీపేట చేపలమార్కెట్‌ ఫిషరీస్‌ డిపార్టుమెంట్‌కు కేటాయించాని కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ కోరిన నేపధ్యంలో ఆ మార్కెట్‌ను కేటాయిస్తూ సమావేశం తీర్మానించింది. 2242.50 చదరపు అడుగుల ప్రదేశంలో నిర్మించిన ఫిష్‌ మార్కెట్‌ను నెలకు రూ.33,638, జిఎస్‌టితో కలిపి చెల్లించే విధంగా సమావేశం తీర్మానించింది. నగర పరిధిలోని 286 సచివాలయాల్లో ప్రైవేటు బిల్డింగ్స్‌లో నిర్వహిస్తున్న 78 సచివాలయాల బిల్డింగ్స్‌కు నెలకు అద్దె రూపంలో రూ.12.78 లక్షలు, అలాగే ఏడాదికి రూ.1.53 కోట్లు చెల్లిస్తూ సమావేశం తీర్మానించింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిశంబర్‌ చివరి నాటికి చెల్లించాల్సిన అద్దెతో పాటు అలాగే ఈ ఏడాదిజనవరి నుంచి వచ్చే డిశంబర్‌ మాసం వరకు అద్దె కాలం పొడిగించే అంశంపై స్థాయి సంఘం ఆమోదిస్తూ తీర్మానించింది. రాణిగారితోట 18వ డివిజన్‌లోని మాదంశెట్టి సీతయ్య వీధి మెయిన్‌ రోడ్డు, క్రాస్‌ రోడ్డులో కొత్తగా డ్రైనేజి లైన్‌, వాటర్‌ పైప్‌లైన్‌ వేయడం వలన ప్రస్తుతం ఉన్న రోడ్లు బాగా దెబ్బతిన్నందున, దాని మరమ్మతుల కోసం రూ.43.70 లక్షలు సాధారణ నిధులతో చేపట్టడానికి స్థానిక కార్పొరేటర్‌ ఇచ్చిన లెటర్‌ ఆధారంగా సర్కిల్‌-3 ఇఇ చంద్రశేఖర్‌ పెట్టిన ప్రతిపాదనను ర్యాటిఫై చేస్తూ సమావేశం తీర్మానించింది. అలాగే ఇదే సర్కిల్‌ పరిధిలోని 3వ డివిజన్‌ కనకదుర్గానగర్‌ కాలనీలో ఉన్న అంతర్గత రహదారులను బిటి రోడ్లుగా వేయాలని స్థానిక కార్పొరేటర్‌ కోరిన దానిపై వాటికయ్యే వ్యయం రూ. 49.90 లక్షలు విఎంసి సాధారణ నిధుల నుంచి వెచ్చించే విధంగా సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో స్థాయి సంఘం సభ్యులు వై ఆంజనేయరెడ్డి, చింతల సాంబయ్య, వి అమర్నాధ్‌, కె అనిత, రమాదేవి తదితర సభ్యులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.