Jul 22,2021 00:00
  • పిడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పరిస్థితి
  • ఇంకా డిపిఆర్‌ తయారీలోనే యంత్రాంగం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల నిర్మాణాలు స్థలాల గుర్తింపునకే పరిమితమయ్యాయి. థర్డ్‌వేవ్‌ కరోనా వచ్చే సరికి ఈ ఆస్పత్రులన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి పిల్లలకు అందులోనే మెరుగైన వైద్యం అందించాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పనులు ముందుకు కదలడం లేదు. విభజన తరువాత ఎపిలో సూపర్‌ స్పెషాలిటీ పిల్లల ఆస్పత్రులు లేవని త్వరగా ఆస్పత్రులను నిర్మించి అందుబాటులోకి తీసుకు రావాలని సిఎం సూచించారు. హైదరాబాదులోని నిలోఫర్‌ ఆస్పత్రి తరహాలో పిడియాట్రిక్‌ సర్జరీ,పిడియాట్రిక్‌ కార్డియాలజీ, పిడియాట్రిక్‌ ఆంకాలజీ వంటి అన్ని పిడియాట్రిక్‌ సబ్‌ స్పెషాలిటీలతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి తగ్గట్టుగా పనులు వేగవంతం కావడం లేదు. ఇప్పటి వరకూ కేవలం స్థలాల గుర్తింపు మాత్రమే జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో పిడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విజవాయవాడలోని సిద్దార్ధ మెడికల్‌ కాలేజి సమీపంలో 5 ఎకరాలు, విశాఖపట్నం రాణి చంద్రమణి దేవీ ఆస్పత్రి ఆవరణలో 5 ఎకరాలు, తిరుపతి రుయా ఆస్పత్రి సమీపంలో 4.5 ఎకరాల భూములను గుర్తించారు. ఈ స్థలాల్లో 500 పడకల సామర్థ్యం గల ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. త్వరితగతిన డిపిఆర్‌ తయారు చేసి టెండర్లు పిలిచి థర్డ్‌వేవ్‌ వచ్చే సరికే ఈ ఆస్పత్రులు అందుబాటులోకి రావాలని సిఎం రెండు నెలల క్రితం ఆదేశించారు. కానీ ఎక్కడా పనులు ముందుకు కదల్లేదు. కేవలం స్థల సేకరణకే పరిమితమయ్యాయి. వారం క్రితం డిపిఆర్‌ తయారీకి మూడు ప్రయివేటు కంపెనీలు ముందుకు రావడంతో ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతోంది. ఆస్పత్రులు అందుబాటులోకి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ప్రతి జిల్లాలోనూ పిల్లల కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో తిరుపతి చిన్నపిల్లల ఆస్పత్రిలో ప్రస్తుతం 160 బెడ్ల సామర్థ్యం ఉంటే, దానికి అదనంగా మరో నలభై బెడ్లతో పాటు 15 ఆక్సిజన్‌ బెడ్‌లను సిద్ధం చేశారు. విజయవాడ జిజిహెచ్‌లో ప్రతేక్య వార్డును కేటాయించి 250 బెడ్లను సిద్ధం చేశారు. విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా 300 పడకలు సిద్ధం చేస్తున్నారు. పిల్లల వైద్యులను నియమించుకోవడం, విద్యుత్‌ సరఫరా, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించుకుని థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ ప్రస్తుతం సన్నద్ధమవుతోంది.