Nov 24,2022 13:05

న్యూఢిల్లీ :   జైలు సిసిటివి ఫుటేజీలపై ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తీహార్‌ జైలులో జైన్‌కి సకల సౌకర్యాలు అందుతున్నాయంటూ పలు వీడియోలను బిజెపి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలను ప్రచురించకుండా అడ్డుకోవాలని జైన్‌.. సీబీఐ కోర్టును కోరారు. ఆ వీడియోలు ఎలా లీక్‌ అయ్యాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. బుధవారం జైన్‌ భోజనం వీడియోను విడుదల చేసింది. సిసిటివి ఫుటేజీ ప్రకారం.. ఆ వీడియో సెప్టెంబర్‌ 14 నాటిది. జైలులోని వీడియోలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) లీక్‌ చేస్తోందని.. దీంతో తనపై నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసులో న్యాయమైన విచారణ జరిగేలా చూడాలని ఢిల్లీ కోర్టును కోరారు. ఇది మీడియా విచారణా.. అని జైన్‌ ప్రశ్నించారు. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియోలతో ఆప్‌ను బిజెపి ఇరకాటంలోకి నెట్టేందుకు యత్నిస్తోంది. అయితే బిజెపి విమర్శలను ఆప్‌ తిప్పికొడుతోంది.