Nov 25,2021 06:16

దేశ నలుమూలల నుంచి ప్రజలు ఖర్తూమ్‌కు పెద్దయెత్తున కదలి రావడంతో మిలిటరీ పాలకులు పౌర నాయకులతో హడావుడిగా చర్చలు జరిపి సార్వభౌమత్వ మండలి పాలనను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే, సార్వభౌమత్వ కౌన్సిల్‌పై జనరల్‌ బుర్హాన్‌, జనరల్‌ డాగాల పట్టు ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి, సైన్యం మళ్లీ ఎప్పుడైనా తన ప్రతాపం చూపించవచ్చని ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే పాలన నుంచి సైన్యం పూర్తిగా తప్పుకుని, తిరిగి బ్యారక్‌లకు వెళ్లేంతవరకు తాము ఉద్యమాన్ని విరమించేది లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు.

భారత్‌లో నిరంకుశ మోడీ ప్రభుత్వం రైతుల పోరాటానికి దిగొచ్చిన కొద్ది సేపటికే ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైనిక పాలనపై ప్రజాతంత్ర శక్తులు విజయం సాధించాయి. మే 25న పదవీచ్యుతుడైన ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ను తిరిగి నియమిస్తున్నట్లు ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌ ప్రకటించారు. జైలులో నిర్బంధించిన మంత్రులను, రాజకీయ నాయకులను, పౌర నాయకత్వాన్ని విడిచిపెడతామని చెప్పారు. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా 'మిలియన్‌ మార్చ్‌'కు ప్రజలు సమాయత్తమవుతుండడం, అంతకుముందు రోజు నిరసనకారులపై సైన్యం సాగించిన దమనకాండలో 40 మందికిపైగా పౌరులు చనిపోయిన నేపథ్యంలో బుర్హాన్‌ వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే పౌర నాయకత్వంతో చర్చలు జరిపి రాజీకి వచ్చారు. అమెరికా దన్నుతో ముప్పయ్యేళ్ల పాటు నియంతృత్వ పాలన సాగించిన ఒమర్‌ అల్‌ బషీర్‌ ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజా ఉద్యమాల ఒత్తిడికి తలగ్గి 2019లో గద్దె దిగాడు. ఆ వెంటనే రాజ్యాధికారం సైనిక, పౌర నాయకత్వంతో కూడిన సార్వభౌమత్వ మండలికి బదలాయించబడింది. సూడాన్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడమే ఈ సార్వభౌమత్వ మండలి ప్రధాన లక్ష్యం. అధికారాన్ని పంచుకునే విషయమై సైన్యానికి, పౌర సమాజ నాయకత్వానికి అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి 21 మాసాలు ప్రభుత్వానికి మిలిటరీ నాయకత్వం వహించాలి. తరువాత 18 నెలలు పౌర నాయకత్వానికి అధికారం అప్పగించాలి. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడేలా చూడాలి. ఆ ప్రకారం పౌర నాయకత్వానికి వచ్చే నెలలో అధికార బదలాయింపు జరగాలి. దీనికి భిన్నంగా అక్టోబరు 25న సైన్యం తిరుగుబాటు ద్వారా మొత్తం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది, రాజ్యాంగాన్ని రద్దు చేసింది. ప్రధాని హమ్‌డోక్‌ను గృహ నిర్బంధం గావించింది. మంత్రులను, పౌర హక్కుల కార్యకర్తలను దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేసింది. కీలకమైన సార్వభౌమత్వ మండలిని రద్దు చేసింది. దీంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. ప్రజలను మభ్యపుచ్చేందుకు సైనిక పాలకుడు సరికొత్త నాటకానికి తెరలేపాడు.
ప్రధాని హమ్‌డోక్‌ను తిరిగి ఆ పదవిలో ప్రతిష్టిస్తానని, 2022లో సూడాన్‌లో ఎన్నికలు జరిపి, ప్రజాస్వామ్య బద్ధమైన పాలన నెలకొనేలా చూస్తానని చెప్పారు. ఆయన మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. ప్రభుత్వంలో సైన్యానికి ఎటువంటి పాత్ర ఉండకూడదని వారు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. సూడాన్‌లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమం తమ రాచరికపు వ్యవస్థ పునాదులను ఎక్కడ కదిలిస్తుందోనన్న భయం సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకులను పట్టి పీడిస్తోంది. సూడాన్‌లో ప్రజాస్వామ్యాన్ని మొగ్గ లోనే తుంచేయాలని, నీకు మేము అండగా ఉంటామని అవి తమ మిత్రుడు బుర్హాన్‌కు సలహా ఇచ్చాయి. ఈజిప్టు కూడా సూడాన్‌ సైనిక పాలకుడికి మద్దతు పలికింది. బుర్హాన్‌ రెచ్చిపోవడానికి ఈ దేశాల మద్దతు కూడా ఒక కారణం. అమెరికా మద్దతుతో నియంతలా వ్యవహరించిన ఒమర్‌ అల్‌ బషీర్‌ పీడ వదిలిందనుకుంటే బుర్హాన్‌ రూపంలో మరో డిక్టేటర్‌ తలెత్తడాన్ని ప్రజాతంత్ర ఉద్యమకారులు సహించలేకపోయారు. ప్రభుత్వంలో సైన్యానికి ఎటువంటి పాత్ర ఉండకూడదని వారు ఢంకా బజాయించి చెప్పారు. 'అరబ్‌ స్ప్రింగ్‌ అప్‌ రైజింగ్‌'కు ఊపిరులూదిన ట్యునీసియాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వారి కళ్ల ముందున్నాయి. సూడాన్‌ మరో ట్యునీసియా కానివ్వబోమని వారు ప్రతినబూనారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీసియాలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2010లో వెల్లువలా వచ్చిన ప్రజా ఉద్యమం ధాటికి అక్కడి నిరంకుశ ప్రభుత్వం కూలిపోయింది. 2014 జనవరిలో ప్రజాతంత్రయుత రాజ్యంగా అది ఆవిర్భవించింది. అయితే, ఈ ఏడాది జులై 25న అధ్యక్షుడు కయాస్‌ సయీద్‌ సైన్యంతో చేతులు కలిపి రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధానిని డిస్మిస్‌ చేసి, పార్లమెంటును రద్దు చేశాడు. మంత్రులను, రాజకీయ నాయకులను, పాత్రికేయులను నిర్బంధించాడు. కొందరిని సైనిక కోర్టుల్లో విచారించాడు. సెప్టెంబరు 22న ఒక ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ జారీ చేస్తూ శాసన, కార్యనిర్వాహక అధికారాలన్నీ తనకే దఖలు పరచుకున్నాడు. ట్యునీసియా గత కొద్ది సంవత్సరాలుగా ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి నెట్టబడుతోంది. కోటీ 20 లక్షల జనాభా కలిగిన ఈ దేశంలో ఆరు లక్షల మంది దాకా కోవిడ్‌ బారిన పడగా, 18,600 మంది దాకా చనిపోయారు. ట్యునీసియాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. సూడాన్‌లో గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు ట్యునీసియా తరహాలోనే ఉన్నాయి. దీంతో సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీతో సహా పలు జాతీయ రాజకీయ పార్టీలు, పౌర సమాజం ఏకతాటిపై నిలిచి సైనిక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించింది. సైనిక తిరుగుబాటు వార్త విన్న వెంటనే ప్రజలు పెద్దయెత్తున రాజధాని ఖర్తూమ్‌, జంట నగరాలైన ఒండుర్మాన్‌లో కదం తొక్కారు. నవంబరు 17న ఒక్క రోజే 40 మంది సైనిక పాలకుల కర్కశత్వానికి బలయ్యారు. ఉత్తర ఖర్తూమ్‌లో 16 మంది విద్యార్థులను సైన్యం కాల్చిపారేసింది. మిలిటరీ పాలకులు ఎంత క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించినా నిరసనకారులు అదరలేదు, బెదరలేదు. దేశ నలుమూలల నుంచి ప్రజలు ఖర్తూమ్‌కు పెద్దయెత్తున కదలి రావడంతో మిలిటరీ పాలకులు పౌర నాయకులతో హడావుడిగా చర్చలు జరిపి సార్వభౌమత్వ మండలి పాలనను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే, సార్వభౌమత్వ కౌన్సిల్‌పై జనరల్‌ బుర్హాన్‌, జనరల్‌ డాగాల పట్టు ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి, సైన్యం మళ్లీ ఎప్పుడైనా తన ప్రతాపం చూపించవచ్చని ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే పాలన నుంచి సైన్యం పూర్తిగా తప్పుకుని, తిరిగి బ్యారక్‌లకు వెళ్లేంతవరకు తాము ఉద్యమాన్ని విరమించేది లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు.
పాలనలో సైన్యం ప్రభావాన్ని పూర్తిగా తొలగించి పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సూడాన్‌లో ప్రజాస్వామ్య శక్తులు బలపడుతున్నాయనడానికి ఇదొక మంచి సంకేతమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


- కె. గడ్డెన్న