Apr 20,2021 21:49

సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

ప్రజాశక్తి - పరిగి :షుగర్‌ ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన భూములలో పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం షుగర్‌ ఫ్యాక్టరీ భూములలో జరుగుతున్న భూమి చదును పనులను అడ్డుకుని యంత్రాలను బయటకు పంపించేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని భూ నిర్వాసితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఈ భూముల్లోకి ప్రవేశించాలంటే హైకోర్టు ఉత్తర్వులు అడ్డుగా చెబుతున్న పోలీసులు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. షుగర్‌ ఫ్యాక్టరీ భవనాలలో నివాసముంటున్న ప్రైవేటు యాజమాన్యాన్ని బయటకు పంపించాలని రైతులు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ శ్రీనివాసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు యాజమాన్యాన్ని ఖాళీ చేయించేందుకు సమయం ఇవ్వాలని చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులు సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించారు. ఈసందర్బంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ పరిశ్రమల కోసం రైతులు ఇచ్చిన భూములలో లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రైవేటు యాజమాన్యానికి హైకోర్టు మొటిక్కాయ వేసిందన్నారు. వెంటనే భూమి విక్రయాలు ఆపాలని రైతులకు న్యాయం చేసే వరకు అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే భూమి సాగుకు రైతుల సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, లింగారెడ్డి, నాగరాజు, రైతులు గణేష్‌, ఆనంద్‌ రెడ్డి, రామదాసు, గోపాలప్ప, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.