Oct 14,2021 20:25

కార్యాలయ పరిసరాలను పరిశీలిస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్వచ్ఛ కార్యాలయం అమల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులకు, సిబ్బందికి నగర మేయర్‌ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో అపరిశుభ్ర వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ పారిశుధ్యం పట్ల చైతన్య పరుస్తున్న సిబ్బంది కార్యాలయ ఆవరణ చెత్తతో నిండి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం వెనకవైపు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి, ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు తక్షణం చేపట్టాలని చెప్పారు. చుట్టూ మొక్కలు నాటి, పూల మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణ చెత్తతో నిండి ఉండటం మంచిది కాదన్నారు. నగరంలో ఉన్న అన్ని కార్యాలయాలు స్వచ్ఛతగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నగరమంతా పచ్చదనంతో, పరిశుభ్ర వాతావరణం వెల్లివిరిసే విధంగా తీర్చిదిద్ది ఆదర్శ నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.