Nov 25,2021 08:35

కోపెన్‌హగెన్‌ : స్వీడన్‌ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎంపికైన మాగ్దలీనా అండర్సన్‌ (54) గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విఫలం కావడంతోపాటు సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్‌ పార్టీ బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు నూతన ప్రధానిగా మాగ్దలీనా ఎంపికకు స్వీడన్‌ పార్లమెంట్‌ 'రిక్స్‌డాగ్‌' ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న మాగ్దలీనా ఇటీవలే సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ నేతగా, ప్రధానిగా స్టెఫాన్‌ లవ్‌ఫెన్‌ తప్పుకోవడంతో ఆ స్థానాలకు మాగ్దలీనా ఎంపిక చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్‌ ఆమోదం తెలుపలేదు. అంతేకాకుండా గ్రీన్స్‌ పార్టీ సంకీర్ణ కూటమి నుండి బయటకు వచ్చేస్తున్నట్లు వెల్లడిచింది. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా లేఖను పార్లమెంట్‌ స్పీకర్‌కు పంపించారు. స్వీడన్‌ పార్లమెంట్‌లో 349 మంది సభ్యులున్నారు. వీరిలో 117 మంది మాగ్దలినాకు అనుకూలంగా, 174 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 57 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. స్వీడన్‌ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లో సగం మంది.. అంటే 175 మంది వ్యతిరేకించనంత కాలం ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగవచ్చు. స్వీడన్‌లో తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి.