Jan 02,2022 16:01

దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఫలితాలను పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేస్తూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాడు నాని. అయితే రెండేళ్లుగా నానికి సరైన హిట్‌ మాత్రం దక్కలేదు. ఇటీవల విడుదలైన 'టక్‌ జగదీష్‌' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో 'శ్యామ్‌ సింగరాయ్'గా ప్రేక్షకుల ముందు నిలి చాడు. టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో 'శ్యామ్‌ సింగరారు'పై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో చూద్దాం..

కథలోకి వెళ్తే.. వాసు అలియాస్‌ వాసుదేవ్‌ (నాని)కి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. ఆ కల నెరవేర్చుకోవడం కోసం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా వదిలిపెట్టే స్తాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుగా ఓ షార్ట్‌ ఫిలిం తీయాలని డిసైడ్‌ అవు తాడు. దాంట్లో నటించేందుకు కీర్తి (కృతిశెట్టి) ని ఒప్పించి 'వర్ణం' అనే లఘుచిత్రం చేస్తాడు. దీంతో వాసు పేరు అన్ని చిత్రసీమలకు పాకిపోతుంది. ఓ పెద్ద సినిమా చేసే అవకాశమొస్తుంది. అతనితో బాలీవుడ్‌లో రీమేక్‌ సినిమా చేసేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొస్తుంది. హిందీ వెర్షన్‌కూ వాసునే దర్శకుడిగా తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీనిపై మీడియా సమావేశం పెడుతుంది. ఇదే సమయంలో కాపీ రైట్స్‌ కేసు కింద వాసు అరెస్ట్‌ అవుతాడు. అతని గత చిత్రాలు రెండూ ప్రముఖ బెంగాలీ రచయిత శ్యామ్‌ సింగరారు రచనల నుంచి కాపీ చేశారని.. ఎస్‌ఆర్‌ పబ్లికేషన్‌ అధినేత మనోజ్‌ సింగరారు (రాహుల్‌ రవీంద్రన్‌) కోర్టుకెక్కుతాడు. అనంతరం కేసు విచారణ క్రమంలో వాసును క్లినికల్‌ హిప్నాసిస్‌ చేయగా.. అతనే గత జన్మలో శ్యామ్‌ సింగరారు అని తెలుస్తుంది. మరి అతని కథేంటి? దేవదాసి మైత్రీ అలియాస్‌ రోజీ (సాయిపల్లవి) తో అతని ప్రేమ కథేంటి? అసలు వాళ్లిద్దరికీ ఏమైంది? శ్యామ్‌ తిరిగి వాసుగా ఎందుకు పుట్టాడు? వాసు తానే శ్యామ్‌ అని కోర్టు ముందు ఎలా నిరూపించుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
పునర్జన్మల కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే వీటిలో చాలా వరకూ విజయవంతమయ్యాయి. 'శ్యామ్‌ సింగ రారు' కూడా ఈ తరహా కథతో రూపొందినదే. దీంట్లో వాసుగా, శ్యామ్‌గా నాని రెండు భిన్నమైన పాత్రల్లో నటిం చారు. వాసు పాత్ర కథ వర్తమానంలో సాగుతుంటే.. శ్యామ్‌ సింగరారు పాత్ర కథ 1970ల కాలం నాటి బెంగాల్‌ నేప థ్యంలో సాగుతుంటుంది. ఆరంభంలో వాసు, కీర్తి పాత్రల్ని పరిచయం చేసిన తీరు.. వాళ్లిద్దరి ప్రేమకథను చూపించిన విధానం బాగుంది. ప్రథమార్ధం మధ్యలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచే కథ మరో మలుపు తీసుకుంటుంది. కాపీరైట్‌ కేసులో వాసు అరెస్ట్‌ అయ్యాక.. కథలో వేగం పెరుగుతుంది. విరామానికి ముందు కేసు విచారణ క్రమంలో వాసును క్లినికల్‌ హిప్నాసిస్‌ చేయగా.. అతనే గత జన్మలో శ్యామ్‌ అని చెప్పడంతో ద్వితీయార్ధంపై అంచనాలు పెరుగుతాయి. ఇక అక్కడి నుంచి కథ మొత్తం శ్యామ్‌ సింగరారు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పరిచయ సన్నివేశంలో అంటరానితనంపై శ్యామ్‌ పలికే సంభాషణలు ఆకట్టుకుంటాయి. దేవదాసి మైత్రిగా సాయిపల్లవి పాత్రని పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. కాళీ ఆలయంలో నాని చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా అనిపిస్తాయి. సినిమాలో శ్యామ్‌ పాత్రను సమాజంలోని అసమానతలు.. అన్యాయా లపై పోరాడే వ్యక్తిగా చూపించినా ఆయన పోరాటాన్ని ఎక్కడా ఆసక్తికరంగా చూపించలేదు. దేవదాసీ వ్యవస్థపై శ్యామ్‌ పలికిన సంభాషణలు కదిలించేలా ఉంటాయి. భావోద్వేగభరితమైన క్లైమాక్స్‌ అందరినీ మెప్పిస్తుంది.
ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. వాసు అనే అప్‌కమింగ్‌ డైరక్టర్‌ పాత్రతో పాటు విప్లవ రచయిత శ్యామ్‌ సింగరారు అనే పాత్రలోనూ ఒదిగిపోయాడు. ఇక ఈ సినిమాలో నాని తర్వాత బాగా పండిన పాత్ర సాయిపల్లవిది. దేవదాసి మైత్రి అలియాస్‌ రోజీ పాత్రలో సాయిపల్లవి జీవించేసింది. వాసు ప్రేయసి కీర్తి పాత్రలో కృతిశెట్టి మెప్పించింది. నాని, కృతిశెట్టి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్‌ బాగా పండింది. లాయర్‌ పద్మావతిగా మడొన్నా సెబాస్టియన్‌ ఫర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం బాగుంది. సిరివెన్నెల రాసిన పాటలు, నేపథ్య సంగీతం మాత్రం అలరించాయి. సను జాన్‌ వర్గేసే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్‌ డిపార్టమెంట్‌ వర్క్‌ కూడా హైలెట్‌. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఫర్వాలేదు.

టైటిల్‌ : శ్యామ్‌ సింగరారు
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్ర, జిస్సు సేన్‌ గుప్తా, అభినవ్‌ గౌతమ్‌, మురళీశర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌
నిర్మాత : వెంకట్‌ బోయనపల్లి
రచన : జంగా సత్యదేవ్‌
దర్శకత్వం : రాహుల్‌ సాంకృత్యన్‌
సంగీతం : మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ : సను జాన్‌ వర్గేసే
ఎడిటర్‌ : నవీన్‌ నూలి
విడుదల తేదీ : డిసెంబర్‌ 24, 2021