Nov 25,2022 22:45
  • హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోం : సిజెఐ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2018 భీమా కోరేగావ్‌ కేసులో దళిత హక్కుల కార్యకర్త ఆనంద్‌ తెల్తుంబ్డేకు బెయిల్‌ మంజూరు చేస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్‌ 18న ఆనంద్‌ తెల్తుంబ్డేకు బెయిల్‌ మంజూరు చేస్తూ ముంబయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఎస్‌ గడ్కరీ, జస్టిస్‌ మిలింద్‌ జాదవ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తెల్తుంబ్డేపై ఉగ్రవాద కార్యకలాపాల నేరానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రాథమిక పరిశీలనలో పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంను ఎన్‌ఐఎ ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్‌ఐఎ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ముంబయి హైకోర్టు తీర్పును సమర్థించింది. 
'యుఎపిఎ సెక్షన్‌లను అమలులోకి తీసుకురావడంలో నిర్దిష్ట పాత్ర ఏమిటి? మీరు ఆరోపించిన ఐఐటి మద్రాస్‌ ఈవెంట్‌ దళితుల సమీకరణ కోసమే. దళితుల సమీకరణ సన్నాహక చర్య నిషేధిత కార్యకలాపాలకు సంబంధించినది కాదు కదా? అని ఎన్‌ఐఎ తరపు న్యాయవాది అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటిని సిజెఐ ప్రశిుంచారు. మావోయిస్టు భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని కూలదోయడానికి తేల్తుంబ్డే కుట్ర పన్నారని చార్జిషీట్‌లో పేర్కొనాురంటూ పలు ఉదాహరణలను వివరించారు. తెల్తుంబ్డే తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ జోక్యం చేసుకొని ఆ పత్రాలేవీ తెల్తుండ్డే నుంచి స్వాధీనం చేసుకోలేదని, ఆయన పంపినట్లు భావిస్తును ఈ మెయిల్‌లు సహ నిందితురాలు రోనా విల్సన్‌ కంప్యూటర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతేడాది ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్‌ నాయకుడు, తన సోదరుడు మిలింద్‌ తెల్తుంబ్డేను 30 ఏళ్లుగా ఆనంద్‌ తెల్తుంబ్డే కలవలేదని ధర్మాసనానికి తెలిపారు. ఆనంద్‌ తెల్తుంబ్డేను ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపెట్టడానికి ఎలాంటి పత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసిందని, ఎల్గార్‌ పరిషత్‌ కార్యక్రమంలో కూడా లేరని, ఆయన అక్కడ ఉన్నారని చూపించడానికి ఎటువంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనానికి కపిల్‌ సిబల్‌ వివరించారు.