
న్యూఢిల్లీ : ఆధార్, ఓటర్ ఐడి కార్డులను అనుసంధానించడానికి వీలు కల్పిస్తున్న ఎన్నికల చట్టాల సవరణను సవాలు చేస్తున్న పిటిషన్‌తో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జెవాలాను సుప్రీం కోర్టు సోమవారం కోరింది. ఈ మేరకు సూర్జెవాలా హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బపన్నలతో కూడిన ధర్మాసనం కల్పించింది. ''ఎన్నికల సవరణ చట్టంలోని 4, 5 సెక్షన్ల చట్టబద్ధతను పిటిషనర్ సవాలు చేస్తున్నందున సమర్ధవంతమైన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం హైకోర్టు ముందుంది. అందువల్ల 226వ అధికరణ కింద హైకోర్టుకు వెళ్ళే స్వేచ్ఛను మంజూరు చేస్తున్నాం.'' అని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్, ఓటర్ ఐడి కార్డులను అనుసంధానించడం వల్ల పౌరుల ప్రాథమిక హక్కైన గోప్యతా హక్కు ఉల్లంఘించబడుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే అవుతుందని పేర్కొన్నారు. ఆధార్‌తో ఓటర్ ఐడిని అనుసంధానించడం పూర్తిగా నిర్హేతుకమైనదని కాంగ్రెస్ నేత వాదించారు.. ఆధార్ కార్డు అనేది నివాస ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి అనేది పౌరసత్వ ధృవీకరణ. పూర్తిగా భిన్నమైన ఈ రెండు పత్రాలను అనుసంధానించాలని ఈ అభ్యంతరకరమైన సవరణ పేర్కొంటోందని అన్నారు. ఆధార్‌ను ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల ఓటర్ల వ్యక్తిగత డేటా అంతా అధికారుల గుప్పెట్లో ఉంటుంది, దీనివల్ల ఓటర్లపై పరిమితులు విధించే అవకాశం వుంటుందన్నారు. వ్యక్తిగత డేటాను రహస్యంగా వుంచడం, నిర్దిష్ట పరిస్థితుల్లో మినహా ఆ డేటాను ఏ ప్రభుత్వ లేదా చట్టబద్ధ అధికారికి అందుబాటులో వుంచకపోవడమనేది పౌరుడి ప్రాథమిక హక్కు. కాబట్టి ఇలా కార్డులను అనుసంధానించడం వల్ల ఓటర్లపై నిఘా పెరిగే అవకాశాలు వున్నాయి. సున్నితమైన ఈ సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే అవకాశాలు కూడా వుంటాయని సూర్జేవాలా తన పిటిషన్లో పేర్కొన్నారు. పౌరుల డేటాను పరిరక్షించేందుకు ప్రసుత్తం ఎలాంటి చట్టాలు లేనందున ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అన్నారు. గతేడాది డిసెంబరులో మూజువాణీ ఓటు ద్వారా ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది.