ISS: దుర్వాసనతో అంతరిక్ష కేంద్రంలో ఆందోళన

ఫ్లోరిడా : కార్గో పాడ్ నుండి వెలువడే దుర్వాసన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని గంటలపాటు ఆందోళనకు దారితీసింది. దీంతో రెండు రోజుల పాటు స్టేషన్‌కు సరుకు రవాణా నిలిచిపోయింది. రష్యా అంతరిక్ష కేంద్రం వైపు ఆహారం, సామగ్రితో శనివారం వచ్చిన ప్రోగ్రెస్ స్పేస్‌క్రాఫ్ట్‌లో దుర్వాసన కనుగొన్నారు. స్టేషన్‌తో డాకింగ్ చేసిన తర్వాత రష్యా వ్యోమగాములు పాడ్ తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు దుర్వాసన గమనించారు. వెంటనే నాసా, రష్యా కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని డోర్‌ తెరవడాన్ని వాయిదా వేయాలని, స్టేషన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. మరింత సురక్షితమైన చర్యలు తీసుకున్న తర్వాత పాడ్ తలుపు తెరిచినట్లు నాసా ప్రకటించింది. సరుకును తొలగించడం ప్రారంభించారు. దుర్వాసన రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వ్యోమగాములకు ఎలాంటి ముప్పు లేదని నాసా కూడా తెలిపింది. ప్రస్తుతం స్టేషన్‌లో సునీతా విలియమ్స్‌తో సహా ఏడుగురు ఉన్నారు. ఇదిలా ఉండగా, అంతరిక్ష వ్యర్థాల ముప్పు కారణంగా స్టేషన్ కక్ష్యను వారంలో రెండోసారి పెంచారు. సోమవారం మూడున్నర నిమిషాల పాటు ఇంధనాన్ని మండించి కక్ష్య పెంచారు.

➡️